బాబుపై అసత్య ఆరోపణలు సరికాదు

share on facebook

– జగన్‌ను ఉగ్రవాదితో పోల్చిన అవంతి ఇప్పుడు జగన్‌ పక్కనే చేరాడు
– అవంతి కోసం భీమిలి వదులుకునేందుకు సిద్ధమయ్యా
– ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్టణం, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : ఎంపీ అవంతి శ్రీనివాస్‌ సీఎం చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్ర వరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అవంతి శ్రీనివాస్‌ స్వలాభం కోసం పార్టీమారాడని అన్నారు. తెదేపాలో అవంతికి అన్ని అవకాశాలు కల్పించారని అన్నారు. అవంతి పార్టీ మారడం వల్ల తెదేపాకే వచ్చే
నష్టం ఏవిూ లేదన్నారు. కానీపార్టీ మారుతూ చంద్రబాబుపై కుల ముద్ర వేసిన అవంతి.. గతంలో కాపు మిత్ర అని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు. అవంతి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరన్నారు. జగన్‌ ఉగ్రవాది కంటే ప్రమాదకారి, రాజకీయాల నుంచి బహిష్కరించాలన్న అవంతి.. ఇప్పుడాయన వద్దకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కాపుమిత్ర అంటూ నెల రోజుల క్రితమే అవంతి పాలాభిషేకం చేశారని గుర్తు చేశారు. తాను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లే ముందు చంద్రబాబుని ఒక్కమాట కూడా అనలేదని, కాంగ్రెస్‌లో మంత్రిగా ఉంటూనే చంద్రబాబు నా రోల్‌మోడల్‌ అని చెప్పానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైకాపా ఇన్‌ఛార్జ్‌లుగా జగన్‌ సామాజికవర్గం వారే ఉన్నారని గంటా విమర్శించారు. అవంతి శ్రీనివాస్‌కోసం భీమిలి టికెట్‌ వదులుకునేందుకు కూడా సిద్ధమయ్యానని వెల్లడించారు. 1999 నుంచి తాను ఎక్కడ కోరుకుంటే అక్కడ టికెట్‌ లభించిందని వివరించారు.

Other News

Comments are closed.