బాలయ్యను కలిసిన టీటీడీపీ నేతలు

share on facebook

– సారథి స్టూడియోలో ‘ఎన్టీఆర్‌’ సినిమా షూటింగ్‌లో బాలయ్య
– టీటీడీపీ పోటీచేసే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని బాలయ్యకు టీటీడీపీ నేతల విన్నపం
– సానుకూలత వ్యక్తం చేసినట్లు వెల్లడి
హైదరాబాద్‌, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని సారథి స్టూడియో ‘ఎన్టీఆర్‌’ సినిమా సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ జరుగుతుంది. విషయం తెలుసుకున్న టీటీడీపీ నేతలు గురువారం ఉదయం సినిమా సెట్‌కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీరు చర్చించారు. బాలయ్యను కలిసిన వారిలో ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌ రెడ్డిలతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రకటించే సన్నివేశాన్ని దర్శకుడు క్రిష్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. బాలయ్య ఖమ్మం జిల్లాలో గత వారం బాలయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా టీటీడీపీ నేతలు బాలయ్యకు తెలిపారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని కోరారు. స్టార్‌ క్యాంపెయినింగ్‌ కోసం ముందుకు రావాలని విన్నవించారు. అన్ని చోట్ల వీలుకాకపోతే కనీసం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అయినా ప్రచారం చేయాలని కోరారు.  అనంతరం టీటీడీపీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో టీటీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఖమ్మంలో బాలయ్య ప్రచారానికి మంచి స్పందన వచ్చిందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వీలుకాకపోయినా.. కొన్ని నియోజకవర్గాల్లోనైనా ప్రచారం చేయాలని బాలయ్యను కోరినట్లు తెలిపారు. మా విన్నపానికి బాలయ్య సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్టీఆర్‌ వేషధారణలో బాలయ్య అచ్చం అన్నగారిని చూసినట్లుగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ సినిమా విశేషాలను, షూటింగ్‌ వివరాలపై కొద్దిసేపు ముచ్చటించినట్లు టీటీడీపీ నేతలు తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Other News

Comments are closed.