బాలీవుడ్‌ పాటలకు కలిసి డ్యాన్స్ చేసిన‌ భారత్‌, పాక్‌ దేశాల సైనికులు

share on facebook

దిల్లీ(జ‌నం సాక్షి ): భారత్‌, పాకిస్థాన్‌ దేశ సైనికుల మధ్య ఎదురు కాల్పుల గురించి సాధారణంగా వింటూనే ఉంటాం. కానీ, కలిసి స్టెప్పులు వేయడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఘటన రష్యాలో జరిగింది. భారత్‌, పాక్‌ దేశాల సైనికులు బాలీవుడ్‌ పాటలకు డ్యాన్సు చేశారు. రష్యాలోని చెబర్‌కుల్‌ పట్టణంలో చైనాకు చెందిన షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఉగ్రవాద వ్యతిరేక డ్రిల్‌ నిర్వహించారు. అది పూర్తయిన సందర్భంగా సైనికులు చిందులు వేశారు. హిందీ పాటలు వస్తుంటే అక్కడి డ్యాన్సర్లతో కలిసి స్టెప్పుల వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శాంతి, ప్రేమకు నిజమైన అర్థం ఈ వీడియోనే అంటూ ఓ వ్యక్తి వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. జై హింద్‌, భారత్‌ మాతాకీ జై అని ట్వీట్‌లో రాశారు.

భారత్‌లోని రష్యన్‌ ఎంబసీ కూడా సైనికులు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ట్వీట్‌ చేసింది. షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌లో భారత్‌, పాక్‌లు 2017లో భాగస్వాములుగా మారిన తర్వాత జరిగిన తొలి ఉగ్రవాద వ్యతిరేక డ్రిల్‌లో ఈ రెండు దేశాలూ పాల్గొన్నాయి. పలు దేశాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రిల్‌కు ‘పీస్‌ ఫుల్‌ మిషన్‌ 2018’ అని పేరు పెట్టారు. దీన్ని సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ ఆఫ్‌ రష్యా నిర్వహించింది. భారత్‌, పాకిస్థాన్‌ సైన్యాలు కలిసి ఈ డ్రిల్‌లో పాల్గొనడాన్ని చైనా ఆహ్వానించింది. ఈ డ్రిల్‌లో చైనా, రష్యా, కజకిస్థాన్‌, తజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌ దేశాలకు చెందిన 3వేల మంది సైనికులు పాల్గొన్నారు. ఇందులో 200 మంది భారతీయ సైనికులు ఉన్నారు. షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ను 2001లో స్థాపించారు. అప్పుడు అందులో చైనా, రష్యా, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, ఉజ్‌బెకిస్థాన్‌ దేశాలు ఉండేవి. 2017లో భారత్‌, పాకిస్థాన్‌లు కూడా చేరాయి.

Other News

Comments are closed.