బిసి కులాలకు అండగా సిఎం కెసిఆర్‌

share on facebook

ప్రభుత్వ నిర్ణయాలే ఇందుకు నిదర్శనం

నేటి సమావేశంపై బిసి ఎమ్మెల్యేల భేటీ

అంశాలపై లోతుగా చర్చ

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పడుతున్న తపనను ఎప్పటికీ మరిచిపోలేమని టీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వారి సంక్షేమానికి ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటూ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆదివారం శాసనసభా కమిటీ హాలులో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. సీఎంతో భేటీలో చర్చించే అంశాలపై బీసీ సంఘాల నేతలతో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని బీసీ(వెనుకబడిన కులాలు) సంఘాలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, వినయ్‌ భాస్కర్‌, ప్రకాశ్‌ గౌడ్‌ సమావేశమయ్యారు. బీసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ సంఘాల సలహాలు, సూచనలను ఎమ్మెల్యేలు సేకరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బీసీ సంఘాలతో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, వినయ్‌ భాస్కర్‌, ప్రకాశ్‌ గౌడ్‌, అంజయ్య యాదవ్‌ సమావేశమయ్యారు. గతంలో ఏ సీఎం కూడా బీసీల సమస్యలపై అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. బీసీ సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జ్యోతిరావు పూలే మార్గాన్నే సీఎం అనుసరిస్తున్నారని చెప్పారు. సమస్యలపై అవగాహనకు వచ్చేందుకే బీసీ సంఘాలతో సమావేశ మయ్యామని పేర్కొన్నారు. 119 బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. అన్ని కుల వృత్తులకు నిధులు కేటాయిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు బీసీ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ అండతోనే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీల కోసం గత ప్రభుత్వాలు సీఎం కేసీఆర్‌ తరహాలో పథకాలు ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ వినూత్న ఆలోచనలు బీసీల పురోగమనానికి తోడ్పడుతాయన్నారు. కుల వృత్తులకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. /ూష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు బీసీలు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నారని తెలిపారు. బీసీ నేతల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దే అని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు బీసీలు అండగా నిలవాలని కోరారు. గతంలో ఏ ముఖ్యమంత్రి బీసీల గురించి ఆలోచించలేదని గుర్తు చేశారు. తమ సూచనలతో సిఎం కెసిఆర్‌ మరిన్ని మంచినిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. బిసిలు టిఆర్‌ఎస్‌కు అండగా ఉంటారని అన్నారు.

Other News

Comments are closed.