బీడీ కార్మిక గృహ పథకానికి స్పందన కరవు 

share on facebook

కరీంనగర్‌,మే16(జ‌నం సాక్షి): బీడీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి స్పందన కరవైంది. బీడీ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఐహెచ్‌ఎస్‌ పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల రాయితీ ఇస్తోంది. ఈ రాయితీ ద్వారా రెండు పడకల ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రచారం, అవగాహన కొరవడడంతో పాటు నిబంధనలు ప్రతిబంధకం కావడంతో కార్మికులు పథకంపై ఉత్సాహం చూపడం లేదు. ఇంటి నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పరిమితి లేని రుణ సౌకర్యం కల్పిస్తారు. రెండు పడక గదుల ఇంటి నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేయాలి. పథకంలోని నిబంధనలు సడలించాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రెండు పడకల ఇళ్లు నిర్మించి ఇస్తుంది. అదే విధంగా కేందప్రభుత్వం కూడా రూ.1.50 లక్షల రాయితీకి బదులు మొత్తం రూ.5 లక్షల రాయితీ ఇవ్వడంతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పీఎఫ్‌ లేని కార్మికులకు కూడా పథకం వర్తింపజేయాలని కోరుతున్నారు. బీడీ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చడానికి కేంద్రం ప్రభుత్వం రూ.150 లక్షల రాయితీ కల్పించడం హర్షణీయం. అయితే నిబంధనలు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బీడీ కార్మిక సంఘం  సభ్యులు అన్నారు. దీంతో కార్మికులు దరఖాస్తు చేసుకోడానికి ముందుకు రావడంలేదు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పథకం నిబంధనలు సడలించాలన్నారు.  రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని బీడీలు చుట్టి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వేలాది మంది కార్మికులకు సొంత గూడులేక అద్దెలు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు నిర్మించుకోవాలంటే పీఎఫ్‌ సౌకర్యంతో పాటు 60 గజాల సొంత స్థలం దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. బీడీ కార్మికురాలి పేరిట లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లపై ఎక్కడా ఇళ్లు ఉండరాదు. కార్మికులకు ఆధార్‌కార్డు, ఏదైనా బ్యాంక్‌ ఖాతా ఉండాలి. ఆదాయం, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి పత్రం, ఈసీ, కుల ధ్రువీకరణ, వివరాల పత్రాలు జత చేయాలి. ఇక్కడే పెద్ద సమస్య ఎదురవుతోంది. 

Other News

Comments are closed.