బ్రిటన్‌ ఎంపీని వెనక్కి పంపేసిన భారత్‌

share on facebook

– సరైన వీసా లేదని విమానాశ్రయం నుంచే పంపేసిన అధికారులు
న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : బ్రిటిష్‌ పార్లమెంటేరియన్‌ లార్డ్‌ అలెగ్జాండర్‌ కారెలిలేను ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించేశారు. సరైన వీసా లేదన్న కారణంతో ఆయన్ని అధికారులు తిప్పి పంపారు. బ్రిటన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు బుధవారం లండన్‌ నుంచి ఢిల్లీకి వచ్చారు. జైల్లో ఉన్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియాకు లార్డ్‌ అలెగ్జాండర్‌ లీగల్‌ కన్సల్టెంట్‌గా ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ అధినేత అయిన ఖలీదా జియాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, దానికి సంబంధించిన పలు విషయాలను దిల్లీలో విూడియా సమావేశంలో వెల్లడించేందుకు ఆయన లండన్‌ నుంచి భారత్‌కు వచ్చారు. అయితే ఆయనకు తగిన వీసా లేదని విమానాశ్రయ అధికారులు భారత్‌లో ప్రవేశానికి నిరాకరించారు. ఆయన భారత్‌కు వచ్చిన ఉద్దేశం, వీసా అప్లికేషన్‌లో వెల్లడించిన కారణంతో సరిపోవడం లేదని అందుకే ఆయనకు అనుమతి నిరాకరించామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లోని షేక్‌ హసీనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను బంగ్లాదేశలోకి అనుమతించకపోవడం వల్ల, భారత్‌లో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి ఖలీదా జియా కేసు గురించి అంతర్జాతీయ విూడియా ముందు వివరించాలనుకున్నానని లార్డ్‌ అలెగ్జాండర్‌ ఢాకా ట్రిబ్యూన్‌కు తెలిపారు. హైప్రొఫెల్‌ న్యాయవాది అయిన లార్డ్‌ న్యాయశాఖలో పలు పదవుల్లో పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో ఆయనను బీఎన్‌పీ నేత ఖలీదా జియా లీగల్‌ బృందంలో చేర్చుకున్నారు. మాజీ ప్రధాని అయిన ఖలీదాపై దాదాపు మూడు డజన్ల క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు ఓ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 2,53,000డాలర్ల డబ్బును అనాథల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి అక్రమంగా తీసుకున్నారనే కేసులో ఆమె దోషిగా తేలారు.

Other News

Comments are closed.