భద్రతా ప్రమాణాల లోపాలను సరిదిద్దాలి

share on facebook

భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ ప్రమాదం తరవాత అలాంటి వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఇలాంటి సంస్థలపై కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఏ మాత్రం భద్రతా చర్యలు లేకుండా నడుపుతున్న సంస్థలపై ఆరా తీసి భద్రతా చర్యలను సవిూక్షించాలి. సంస్థ ఏదైనా సామాన్యులేఉ బలి కావడం, వారి కుటుంబాలు వీధిపాలు కావడం దారుణం కాక మరోటి కాదు. పదిమందిని బలిగొన్న వరంగల్‌ భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌ పేలుళ్ల తరవాత పోలీసులు ముమ్మరం దర్యాప్తు చేస్తుంటే విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. గోదామును పరిశీలించి సీజ్‌చేశారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గోదాములో వందల క్వింటాళ్ల మందుగుండు సామగ్రిని, పటాకులను గుర్తించి సీజ్‌చేశారు. ఆరుబయట డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన భారీపేలుడు పదార్థాలను చూసి పోలీసులే నివ్వెరపోయారు. అయితే పేలుడుకు దారితీసిన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. పటాకులు కొనేందుకు వచ్చినవారిలో ఎవరైనా సిగరెట్‌ అంటించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? గోదాములో మొబైల్‌ ఫోన్‌ వల్ల స్పార్క్‌ వచ్చిందా? విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది పక్కన పెడితే ఇలాంటి కర్మాగారాల కారణంగా ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా తీసుకుంటున్న చర్యలను ముందుగా సవిూక్షించాలి. ఇలాంటి కర్మాగారాలను నడిపేందుకు అవసరమైన చర్యలు ఎలా ఉండాలో మార్గదర్శకాలను రూపొందించాలి. ఇకపోతే ఫ్యాక్టరీలో అంతపెద్ద స్థాయిలో పేలుడు పదార్థాలు ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి? పటాకుల తయారీకోసమే అయితే ఆ స్థాయిలో అవసరమా? భారీఎత్తున పేలుడుకు దారితీసే జిలిటెన్‌ స్టిక్స్‌ ఏమైనా ఉన్నాయా? ప్రమాదకర మందుగుండు సామాగ్రి సంఘ విద్రోహ శక్తులకు ఏవైనా సరఫరా చేస్తున్నారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. కేవలం గోడౌన్‌కు మాత్రమే అనుమతి పొందిన భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ యజమాని అక్కడ గత కొన్నేండ్లుగా వివిధ రూపాల్లో కొత్తరకం పటాకులు తయారుచేసి ప్రయోగాత్మకంగా ఆ పరిసరాల్లోనే పేలుస్తాడని తేలింది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలకు పటాకులు సరఫరా చేస్తారు. బుధవారం మొత్తం 14 మంది పనిలోకి వెళ్తే పదిమంది మృతిచెందగా.. నలుగురు మృత్యుంజయులుగా బయట పడ్డారని, పటాకుల కొనుగోలుకు వచ్చిన నలుగురు బయటకు వెళ్లిపోయారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. పటాకలు తయారీకి అనుమతి ఉన్నా రక్షణ చర్యలు లేవు. ప్రమాదాలు జరిగితే అంతే సంగతులు. ప్రజల ప్రాణాలకు ఏ రకమైన భరోసా లేదు. నిత్యం నిప్పుతో చెలగాటం అనదగ్గ బాణసంచా తయారు చేసేచోట, వాటిని నిల్వచేసే ప్రదేశంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఏమాత్రం ఏమరు పాటుతో ఉన్నా పెను నష్టం సంభవిస్తుంది. కోటిలింగాలలో ఉన్న గోదాంలో బుధవారం హఠాత్తుగా పేలుళ్లు సంభవించి, క్షణాల్లో మంటలు వ్యాపించి 11 మంది సజీవదహనమైన ఉదంతంలో ఇదే జరిగింది. పేలుడు శబ్దాలు దాదాపు నగరమంతా వినిపించాయంటే… వాటి ధాటికి మూడు కిలోవిూటర్ల నిడివి లోని ఇళ్లు కంపించాయంటే ఈ ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముప్పు ముంచుకొచ్చాక కదలటం మినహా ముందు జాగ్రత్త చర్యల్లో అధికార యంత్రాంగం ఎప్పుడూ విఫలమవుతున్నదని వరంగల్‌ ఉదంతం రుజువు చేసింది. బాణసంచా, టపాసుల తయారీ మాత్రమే కాదు… వాటిని నిల్వ చేసే గోదాంలు కూడా జనావాసాల మధ్య ఉండకూడదన్న కనీస నిబంధనను పట్టించుకోలేదు. అలాగే వాటిని తెచ్చి నిల్వ చేసి, విక్రయించడానికిమాత్రమే అనుమతి ఉన్న సంస్థ తయారీ పనులకు దిగకూడదు. కానీ వరంగల్‌ నగరంలో ఈ రెండింటినీ ఉల్లంఘించారు. ఎక్కడినుంచో పేలుడు పదార్థాలను తెప్పించుకుని 60మంది కార్మికులతో బాణసంచా, టపాసులు ఉత్పత్తి చేస్తున్నా అధికారుల దృష్టికి రాకపోవడం దారుణం. దాదాపు మూడు నాలుగేళ్లనుంచి ఇదంతా కళ్లముందే సాగుతున్నా అధికార యంత్రాంగం, ప్రత్యేకించి అగ్ని మాపక శాఖ పట్టించుకోలేదు.ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న విషయాల్లో కూడా పర్యవేక్షణ ఇంత కొరవడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరికి వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనడానికి కలెక్టర్‌ ప్రకటన తెలియచేస్తోంది. ఈ ప్రాంతం జిల్లా విభజన తరవాత అర్బన్‌ పరిధిలోకి పోయిందని, అయినా పరిశీలిస్తామని చెప్పడం బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది. నిబంధనలు, ప్రమాణాలు కఠినంగా అమలు చేసివుంటే ఇలాంటి దారుణాలు ఖచ్చితంగా జరగవు. జనం భద్రతకు, కార్మికుల శ్రేయస్సుకు తోడ్పడేలా అధికారుల చర్యలు లేవన్నది మాత్రం ఇక్కడ సుస్పష్టం. ఇకపోతే ఈ పక్రియలో నిర్దేశిత ప్రమాణాలను, అనుమతించిన రసాయనాలను మాత్రమే వినియోగిస్తున్నారా లేక నిషిద్ధ పదార్థాలేమైనా ఉపయోగిస్తున్నారా అన్న పర్యవేక్షణ కూడా లోపించింది. అలాగే తయారైన బాణసంచాను, టపాసులను తీసుకెళ్లడంలో, నిల్వ చేయడంలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించడం లేదన్న విషయం కూడా బట్టబయలయ్యింది. వరంగల్‌ ఉదంతంలో చట్టవిరుద్ధంగా టపాసులు, బాణసంచా తయారీ పనులు చేయిస్తున్నట్టు తమ దృష్టికి రాలేదని అధికారులు చెప్ప తప్పించుకోలేరు. అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నదని తెలిసినా కార్మికులు కేవలం పొట్టకూటికోసం ఇలాంటి పనుల్లో దిగుతున్నారు. కోటిలింగాల ఘటనతో అయినా అధికారులు మేల్కోవాలి. ఎక్కడెక్కడ ఇలాంటి సంస్థలు పనిచే/-తున్నాయో గుర్తించి కఠిన భద్రతా చర్యలకు పూనుకోవాలి.

 

Other News

Comments are closed.