భాజపాయేతర పక్షాలు మాతో కలిసిరావాలి

share on facebook

– భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడింది
– తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తున్నారు
– సోదాలపేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
– అవిశ్వాసంలో తాము నెగ్గితీరుతాం
– జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి
బెంగళూరు, మే17(జ‌నం సాక్షి) : కర్ణాటకలో తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపాయేతర పక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందని జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి పిలుపునిచ్చారు. బెంగళూరులో ఆయన గురువారం విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. దాన్ని ఎదుర్కొనేందుకు మమతాబెనర్జీ, చంద్రబాబునాయుడు, కేసీఆర్‌, మాయావతి తమతో కలిసిరావాలని కోరారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు భాజపా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని కుమారస్వామి అన్నారు. భాజపా మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించడం దారుణమని కుమారస్వామి అన్నారు. గవర్నర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనీ… సోదాల పేరుతో ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. వాళ్లు ఎమ్మెల్యేలను బెదిరిస్తున్న సంగతి నాకు తెలుసని, తనపై కేందప్రభుత్వం ఈడీని ఉసిగొల్పుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ నాతో చెప్పారన్నారు. తనపై ఈడీ కేసు ఉందనీ.. వాళ్లు తనకు ఉచ్చు బిగించనున్నారని ఆయన చెప్పారు. తన ప్రయోజనాలను కాపాడుకోవాల్సినందున తనను మన్నించాలన్నారు.. అని కుమారస్వామి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందనీ.. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై అన్ని ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడను కోరతానన్నారు.
—————————————————

Other News

Comments are closed.