భారత్‌కు సాయం అందిస్తాం

share on facebook

– భారత చమురు దిగుమతులపై అమెరికా స్పందన
న్యూయార్క్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. తమ ‘మిత్రదేశం’ భారత్‌.. చమురు దిగుమతులు చేసుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయ
మార్గాలు చూస్తున్నామని అమెరికా వెల్లడించింది. 2015లో ఇరాన్‌తో చేసుకున్న అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్‌పై గతంలో ఎత్తివేసిన కఠిన ఆంక్షలను తిరిగి విధిస్తున్నామని తెలిపింది. ఈ ఆంక్షలు నవంబరు 4 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. ఈ ఆంక్షలతో భారత్‌ సహా ఇతర మిత్రదేశాలు ఇరాన్‌ చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా ఆశిస్తోంది. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించాలనుకుంటే.. ఆయా దేశాలకు తమ ఆర్థిక, బ్యాంకింగ్‌ వ్యవస్థను ఉపయోగించుకునే వీలు ఉండబోదని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. అయితే ఈ ఆంక్షలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్‌ నుంచి చమురు అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఆ దిగుమతులను కొంత తగ్గించుకోగా.. మరింత తగ్గించుకుంటే భారత్‌లో చమురు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో ఈ విషయంపై స్పందించిన అమెరికా.. ఇరాన్‌ కాకుండా భారత్‌కు చమురు దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తామని చెబుతోంది.
‘ఇరాన్‌పై ఆంక్షలు విధించే అంశంపై మిత్రదేశాలు, భాగస్వాములతో చర్చిస్తున్నాం. చమురు దిగుమతులు భారత్‌కు ఎంత అవసరమో మేం గుర్తించాం. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై మేం చర్చలు జరుపుతున్నాం. మా మిత్రదేశమైన భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడకుండా చమురు దిగుమతులపై ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నాం’ అని సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఆసియా రీజియన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ అలైస్‌ వెల్స్‌ తెలిపారు.

Other News

Comments are closed.