భారత్‌×కివీస్‌ సెమీస్‌కు వరుణుడి అడ్డంకి

share on facebook

మాంచెస్టర్‌:  ప్రపంచకప్‌ తొలి సెమీస్‌కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి మూడు ఓవర్ల ముందు చిరుజల్లులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్‌ టేలర్‌(67 నాటౌట్‌), లాథమ్‌(3నాటౌట్‌)లు ఉన్నారు.

గ్రాండ్‌హోమ్‌ ఔట్‌
న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(16)ను భువనేశ్వర్‌ ఔట్‌ చేశాడు. భువీ వేసిన స్లో బౌన్సర్‌ను అప్పర్‌ కట్‌ ఆడబోయి గ్రాండ్ హోమ్‌ విఫలమయ్యాడు. దీంతో భువీకి ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ లభించింది. మరోవైపు రాస్‌ టేలర్‌ తన దైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

టేలర్‌ హాఫ్‌ సెంచరీ
న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ కీలక మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించి సులువుగా పరుగులు రాబట్టాడు. తొలుత ఆచితూచి ఆడిన టేలర్‌ అనంతరం గేర్‌ మార్చి స్కోర్‌ బోర్డు పరిగెత్తించాడు. విలియమ్సన్‌ అవుటయ్యాక జట్టు బాధ్యతను భుజాలపై వేసుకున్న టేలర్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు.

విలియమ్సన్‌ ఎట్టకేలకు ఔట్‌
భారత్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో కివీస్‌ స్కోరును చక్కదిద్దిన కేన్‌ విలియమ్సన్‌ ఎట్టకేలకు ఔటయ్యాడు. భారత స్పిన్నర్‌ చహల్‌ వేసిన 36 ఓవర్‌ రెండో బంతికి ఔటయ్యాడు. కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడబోయిన విలియమ్సన్‌.. జడేజాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 134 పరుగుల వద్ద కివీస్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ పరుగులు చేయడానికి శ్రమిస్తోంది.

విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ

కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కివీస్‌ కష్టాల్లో పడ్డ తరుణంలో సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన విలియమ్సన్‌ అర్థ శతకం నమోదు చేశాడు. 79 బంతుల్లో హాఫ​ సెంచరీ మార్కును చేరాడు. 32 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. గప్టిల్‌(1) తొలి వికెట్‌గా, నికోసల్‌(28) రెండో వికెట్‌గా ఔటయ్యారు.

నికోలస్‌కు దిమ్మతిరిగింది..

న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. లెప్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నికోలస్‌(28) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నికోలస్‌ నిష్క్రమణతో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ జోడిని ఎంత త్వరగా విడదీస్తే టీమిండియాకు అంత లాభం.

విలియమ్సన్‌ @ 500
ప్రపంచకప్‌ 2019లో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ 500 పరుగుల మైలురాయిని సాధించిన ఆరో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, షకీబుల్‌, ఫించ్‌, జో రూట్‌లు కూడా ఐదు వందల పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక ప్రపంచకప్‌లో ఐదు వందల పరుగుల సాధించిన రెండో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌గా, తొలి సారథిగా రికార్డు సృష్టించాడు. గత ప్రపంచకప్‌లో మార్టిన్‌ గప్టిల్‌ ఈ మార్క్‌ను అందుకున్నాడు.

కివీస్‌ చెత్త రికార్డు
వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోయి 27 పరుగులు చేసింది.  ఫలితంగా ఈ మెగా టోర్నీలో పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా కివీస్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకూ ఇంగ్లండ్‌పై భారత్‌ చేసిన 28 పరుగులు పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరుగా ఉండగా, తాజాగా న్యూజిలాండ్‌ దాన్ని సవరిస్తూ చెత్త గణాంకాల అపప్రథను సొంతం చేసుకుంది.

ఒకటికి ఒకటి..
న్యూజిలాండ్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో గప్టిల్‌ పెవిలియన్‌ చేరాడు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. 14 బంతులు ఆడిన గప్టిల్‌ పరుగు మాత్రమే చేశాడు. దాంతో పరుగు వద్దే కివీస్‌ వికెట్‌ను కోల్పోయింది.

మొదటి రెండు ఓవర్లు మెయిడిన్‌
భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌ మెయిడిన్‌ కాగా,  బుమ్రా వేసిన రెండో ఓవర్‌ సైతం మెయిడిన్‌ కావడం విశేషం. కాగా, మూడో ఓవర్‌లో కివీస్‌ ఖాతా తెరిచింది. భువనేశ్వర్‌, బుమ్రా ద్వయం కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 8వ ఓవర్‌ వరకు ఫోర్‌ కొట్టలేకపోయింది కివీస్‌

ఆదిలోనే భారత్‌కు షాక్‌
మ్యాచ్‌ ప్రారంభమైన వెంటనే టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను మార్టిన్‌ గప్టిల్‌, హెన్రీ నికోలస్‌లు ఆరంభించారు. కాగా, భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. తొలి ఓవర్‌ను భువనేశ్వర్‌ చేతికి అందించాడు. తొలి బంతికే భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్‌ సాధించినంత పని చేశాడు.  భువీ వేసిన తొలి ఓవర్‌ మొదట బంతిని గుడ్‌ లెంగ్త్‌లో సంధించాడు. ఇది కాస్తా గప్టిల్‌ బ్యాట్‌ను దాటుకుని ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత్‌ అప్పీల్‌ చేయగా, ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. దానిపై భారత్‌ చివరి క్షణాల్లో రివ్యూకు వెళ్లడంతో ఆ బంతి లెగ్‌ స్టంప్‌కు అతి సమీపం నుంచి బయటకు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. దాంతో భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో మొదటి బంతికే భారత్‌ రివ్యూ కోల్పోయింది.

Other News

Comments are closed.