భూ పంపిణీతో రైతులుగా ఎదిగిన ఎస్సీలు

share on facebook

వ్యవసాయికంగా లబ్ది పొందుతున్న పలువురు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దళిత రైతులు ఇప్పుడు వ్యవసాయికంగా మంచి లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో లబ్ధిదారులు పత్తి, సోయాబి, కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తున్నారు. గతంలో కూలీ పనులు చేసి కుటుంబాలను పోషించుకునే వారు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన భూమిలో పంటలు సాగుచేస్తున్నారు. పలు గ్రామాల్లో గతంలో కూలీలు ఇప్పుడు రైతులుగా మారారు. జిల్లా వ్యాప్తంగా గత నాలుగేళ్లలో అధికారులు 2924 ఎకరాల భూమిని 1101 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 297 మంది లబ్ధిదారులకు 800.25 ఎకరాలను పంపిణీ చేశారు. జిల్లాలోని దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మూడెకరాల భూమి పంపిణీ పథకం పేదల పాలిట వరంగా మారింది. అధికారులు ఈ ఏడాది జిల్లాలో వేయి ఎకరాలను పంపిణీ చేయాలని నిర్ణయించగా ఇప్పటికే 800 ఎకరాలను పంపిణీ చేయగా మరో 351 ఎకరాలను కొనుగోలు చేసి అర్హులకు అందజేయనున్నారు. మొత్తం 1152 ఎకరాలను లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు అంటున్నారు. లక్ష్యానికి మంచి 152 ఎకరాలను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారుల పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తెలుసుకొని వారికి వ్యవసాయ రంగంలో అనుభవం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అర్హులను ఎంపిక చేస్తున్నారు. దళితబస్తీలో భాగంగా అధికారులు వ్యవసాయానికి యోగ్యమైన భూములను గుర్తించి

కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో భూముల అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులను ముందుగానే గుర్తిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, వ్యవసాయ, భూగర్భ జల, ల్యాండ్‌ అండ్‌ సర్వే శాఖలకు చెందిన అధికారులు బృందంగా ఏర్పడి భూములను పరిశీలించారు. ఎలాంటి వివాదాస్పదం లేని భూములను ఎంపిక చేస్తున్నారు. భూమి అమ్మాలనుకునే రైతు ఎన్ని సంవత్సరాల నుంచి అందులో ఎలాంటి పంటలు సాగుచేస్తున్నదీ, ఏయే పంటలు వేసిందీ, పంటల దిగుబడులు ఎలా ఉన్నాయన్న వివరాలు సేకరిస్తున్నారు. వ్యవసాయ బావులు, విద్యుత్తు సదుపాయంతో పాటు చెరువులు, కాలువల పారకం ఉన్న భూములకు అధికారులు కొనుగోలులో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ భూముల్లో వానాకాలం పంటతో పాటు నీటి సౌకర్యం ఉండడంతో యాసంగి పంటలను కూడా సాగు చేస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు,

Other News

Comments are closed.