మండలి రద్దుతో నష్టపోయేది టిడిపియే

share on facebook

అందుకే రద్దును తప్పుపడుతున్న చంద్రబాబు

గతాన్ని గుర్తు చేసుకుని బాబు మాట్లాడితే మంచిది

రాజకీయ పునరావాసాల ఏర్పాటు సరైంది కాదని గుర్తించాలి

అమరావతి, జనవరి 28 (జ‌నంసాక్షి):  ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం శాసనమండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసింది. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్టీయే బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న చైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఎంతమాత్రం సహించలేకపోయారు. ఇందుకు ప్రతిగా ఆయన అడ్డుగా ఉన్న మండలినే తొలగించేందుకు సిద్ధపడ్డారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి రాజధాని అంశమే కాదు, ప్రభుత్వ భవిష్య నిర్ణయాలు వేటిపైనా ఇక ప్రశ్న, చర్చలకు అవకాశం ఇవ్వకూడదన్నది ముఖ్యమంత్రి ఉద్దేశంగా కనిపిస్తున్నదని గట్టిగా వినిపిస్తున్నారు. అయితే రద్దువల్ల నష్టపోతున్నది కేవలం తెలుగుదేశం మాత్రమే. అలాగే బిజెపికి కూడా నష్టం ఉంది. ఉన్న రెండు ఎమ్మెల్సీలు కూడా పోతాయన్న భయం ఉంది. శాసన మండలి రద్దుకు సంకల్పించినది మొదలు ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఆలోచనలకు అనుగుణంగా సమర్థంగా వాదనలు ముందుకు తెచ్చారు. శాసనసభలోనే విద్యావంతులు, మేధావులు నిండుగా ఉన్నప్పుడు విడిగా ఈ మేధావుల సభ ఎందుకని స్వయంగా సిఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకున్నప్పుడు ఏటా అరవైకోట్ల అదనపు ఖర్చు అవసరమా అన్నారు. గతంలో, శాసనసభలో విద్యావంతులు, మేధావులు లేనందునే మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేశారు. కానీ ఇప్పుడా అవసరం లేదు. నిజానికి రాజకయీ పునరావాస లోటు పూడ్చేందుకే వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి శాసనమండలిని పునరుద్ధరించారన్నది కాదనలేని నిజం. లోక్‌సభలో మెజారిటీ ఉన్న బీజేపీ, రాజ్యసభలో పైచేయిగా ఉన్న కాంగ్రెస్‌ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో చూస్తున్నదే. అయితే అక్కడ రాజ్యసభ అన్నది రాజ్యాంగ వ్యవస్థలో భాగం. కానీ రాష్టాల్ల్రో అలాంటి అవకావం లేదు. లోక్‌సభ ఆమోదించిన ఎన్నో బిల్లులను రాజ్యసభ సెలక్ట్‌ కమిటీకి పంపుతున్నది. కేంద్రంలో బీజేపీ తొలివిడత పాలనాకాలంలో రాజ్యసభలో దాని బలం మరీ తక్కువ. తమ తరఫున ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేందుకు రాజ్యసభ అవకాశం కల్పించింది. మండలి ప్రయోజనాలను ఏరకంగానూ ప్రజాకోణం నుంచి చూడలేము. రాజకీయ పునరావాసం కోసమే ఇది పనికి వస్తుందన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు ఎపి మండలిలో అలాంటి అవసరమే టిడిపికి ఉంది. అందుకే ఆ పార్టీ తన గళాన్ని గట్టిగా వినిపిస్తూ గతానికి..నేటికి తేడా అని వాదిస్తోంది. అత్యంత కీలకమైన అంశాలపై ఉన్నతమైన, అర్థవంతమైన చర్చలకు శాసనమండలి వేదికగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నా..రానురాను అది రాజకీయ వేదికగానే మారింది. గతంలో ఎన్టీఆర్‌ మండలిని రద్దుచేయడమూ, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి అందుకు కంకణం కట్టుకోవడం రెండూ సరైన నిర్ణయాలుగా స్వాగతించాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మండలి అవసరం లేకున్నా టిడిపి రాజకీయ అవసరాల కోసం యాగీ చేస్తోంది. మండలిలో ఉన్న బలాన్ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసిపీ నాయకులు విమర్శిస్తున్న తీరు కూడా సరైనదే కావచ్చు. తాము కోరినట్టుగా జరగనందున ఇక దానితో అవసరం లేదని తీర్మానించి మండలిని భూస్థాపితం చేయాలనుకోవడం నియంతృత్వపు పోకడగా టిడిపి చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం సందర్భం లేదు. అయితే తమకు అడ్డులేదనుకున్నప్పుడు మండలిని తేవడం, నచ్చనప్పుడు రద్దుచేయడం సరికాదు. దీనిని మొత్తంగానే తొలగించడం మంచి పని. టిడిపి కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించి దానిని తిరిగి పునరుద్దరిస్తామనే ప్రతినలు మానాలి. రాజకీయ పునరావాస కేంద్రాల ఏర్పాటును అడ్డుకోవాలి.

Other News

Comments are closed.