మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావులపై ఇసికి ఫిర్యాదు

share on facebook

వ్యక్తిగత దూషణలకు దిగారని టిడిపి ఆరోపణ

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావుతో పాటు పలువురు తెరాస నేతలపై టిడిపి ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంలో వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ను తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని.. తమ పార్టీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డిని మంత్రి హరీశ్‌రావు బెదిరించేలా మాట్లాడుతున్నారని నేతలు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. తెరాస అభ్యర్థులు గంగుల కమలాకర్‌, భూపాల్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని… వారిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

హరీష్‌ వ్యాఖ్యలపై రేవూరి కౌంటర్‌

నాలుక కోస్తానంటూ టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. హరీష్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చంద్రబాబును తిట్టడం ద్వారా కేసీఆర్‌ మెప్పు పొందాలని హరీష్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆది నుంచీ ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకోవడం హరీష్‌ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. తన నాలుక కోస్తానంటూ హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని రేవూరి డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే.. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

 

Other News

Comments are closed.