మతపరమైన రిజర్వేషన్లకు..  బీజేపీ వ్యతిరేకం

share on facebook

– వారసులను సీఎం చేయడానికే కేసీఆర్‌ ముందస్తుకెళ్లాడు
– మజ్లిస్‌ కనుసన్నల్లో కేసీఆర్‌ పాలన
– కౌంటింగ్‌ తరువాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌లు ఉండవు
– దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
– తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి తీరుతాం
– 14వ ఆర్థిక సంఘంలో రూ.1,15,605 కోట్లు తెలంగాణకు ఇచ్చాం
– కేంద్రం నిధులివ్వడం లేదనడం హాస్యాస్పదం
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
హైదరాబాద్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : మతపరమైన రిజర్వేషన్‌లకు బీజేపీ వ్యతిరేకమని, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలు, ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని అలాంటి వాటికి మేం ఒప్పుకోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బూత్‌కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముందుస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడోప్రజలకు చెప్పాలని అన్నారు. 2019లో ప్రధాని నరేంద్రమోదీ గాలిలో కేసీఆర్‌ కొట్టుకపోతామనే భయంతోనే ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. అంతే కాకుండా ముంస్తుకు వెళ్లి ఎన్నికల తరువాత కొడుకును, కూతురును సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చుననే భావనంతో కేసీఆర్‌ ముందస్తుకెళ్లాడని విమర్శించారు. అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కేసీఆర్‌కు పట్టవని అమిత్‌ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొడుకులు, కూతుళ్లు అధికారంలో ఉండరని షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదంతా పక్కనపెట్టి కేవలం అభివృద్ది కోసమే ఎన్నికలకు వెళ్లామని టీఆర్‌ఎస్‌ కట్టుకథలు చెబుతోందని విమర్శించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకోదని స్పష్టంచేశారు. ప్రజలను రెచ్చగొట్టడానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రోహింగ్యాలు వస్తే కనీసం ఇక్కడి ప్రజల కోసం కూడా కేసీఆర్‌ ఆలోచనచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ యూపీఏ సర్కార్‌లో మంత్రిగా ఉన్నారని.. అయినా 13వ ఆర్థిక సంఘంలో రూ.16,597 కోట్లు మాత్రమే తెలంగాణకు వచ్చాయని అన్నారు. కానీ ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘంలో రూ.1,15,605 కోట్లు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. ఇంత చేసినా మోదీ తెలంగాణకు అన్యాయం చేసారనడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ 11కోట్ల మంది సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. దేశంలో 15మంది బీజేపీ సీఎంలు ఉన్నారని అమిత్‌సా అన్నారు. ఏపీ, తెలంగాణ, చత్తీస్‌ గఢ్‌, త్వరలో జరగబోయే రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుపొందాల్సిన అవసరం ఉందని, గెలుపు సాధ్యమవుతుందన్నారు. దేశంలో ఒక్కశాంతం ఓటులేని చోట అధికారంలోకి వచ్చిన ఘనత బీజేపీది అన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారని తెలిపారు. అందుకే బీజేపీకి పట్టం కడుతున్నారని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ గాలి
వీస్తుందని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అమిత్‌షా తెలిపారు. మజ్లిస్‌ చెప్పినట్లు కేసీఆర్‌ ప్రభుత్వం నడుస్తుందని, అందుకు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ తరువాత టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ఉండవని అమిత్‌షా పేర్కొన్నారు.
అమిత్‌ షా ఎదుట స్వాముల ఆవేదన ..
తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చారు. ఢిల్లీ నుంచి ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అక్కడ స్థానిక బీజేపీ అగ్రనేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్‌
చేరుకుని అక్కడ మహారాజా శ్రీ అగ్రసేన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అగ్రసేన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై సాధువులు అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. తెలంగాణాలో హిందువులపై దాడులు జరుగుతున్నా సర్కార్‌ పట్టించుకోవడం లేదని, దాడులు చేసిన వారికే ప్రభుత్వం అండగా ఉంటుందని స్వాములు, అమిత్‌ షా ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Other News

Comments are closed.