మదనపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

share on facebook

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా

చిత్తూరు,జనవరి23(జ‌నంసాక్షి): అధికారులు హావిూలు అమలు చేయాలని-పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ.. సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ… అధికారులు ఇచ్చిన హావిూలను అమలు చేసి ఇళ్ళ స్థలాలు ఇస్తారా లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సబ్‌ కలెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ లు స్పందించి పేదలకు ఇళ్లు స్థలాలు మంజూరు చేయాలని లేని పక్షంలో ఈ నెల 30, 31 తేదీలలో వంటా, వార్పు, నిద్ర కార్యక్రమం ద్వారా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారుల తీరుకు నిరసనగా పట్టణంలోని పేదలందరూ ఈ వంటా, వార్పూ, నిద్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత అయిదు నెలలుగా ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని పేదలు పోరాడుతుంటే.. అధికారులు స్పందించక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయిస్తే మదనపల్లెలో ఇళ్ల పట్టాలు అవినీతి అధికారుల మూలంగా అక్రమార్కులకు అందతున్నాయి తప్ప నిజమైన అర్హులకు చేరడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్‌ నెలలో మదనపల్లె తహశీల్దార్‌కు ఇళ్ళ స్థలాల మంజూరు కై అర్హుల జాబితా అందచేసినా ఇప్పటివరకు విచారణ చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు దురాక్రమణకు గురవుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేదలపై దాడులు చేయడం దురహంకార చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.చంద్రశేఖర్‌, ఎం.నారాయణ స్వామి, రమేష్‌, శేషాద్రి, సురేష్‌, రమాదేవి, రామలక్ష్మి, శకుంతల, లక్ష్మీపతి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.