మరింత ధృడంగా విశాఖ ఉక్కు పోరాటం

share on facebook

300 రోజు మహధర్నాతో ఐక్యత చాటిన కార్మికలోకం
కేంద్రంపై పోరాటానికి అంతా కలసి రావాలని పిలుపు
విశాఖపట్టణం,డిసెంబర్‌8 (జనం సాక్షి):  ఓ వైపు అమరావతి ఉద్యమం..ఇటు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పాతగాజువాకలో చేపట్టిన మహాధర్నాతో విశాఖ మార్మోగింది. కేంద్రం తీరును తప్పుపడుతూ మహాధర్నాలో కార్మికులు పాల్గొన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదంటూ… బుధవారం 300 వ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖలో మహాధర్నా చేపట్టాయి. కేంద్ర బిజెపి విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ’విశాఖ ఉక్కు`ఆంధ్రుల హక్కు’ అంటూ ప్రాణాలొడ్డి సాధించుకున్న స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు చేపట్టిన ఉద్యమం బుధవారంతో 300 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. కేంద్రానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో వాటాల విక్రయానికి నిర్ణయించినట్లు ఈ ఏడాది జనవరి 27న కేంద్ర కేబినెట్‌ కమిటీ
ప్రకటించింది. ఆ రోజు నుంచే ఉక్కు కార్మికులు, భూములిచ్చిన నిర్వాసితులు ఉద్యమ బాటపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్మాగారం ఆర్చ్‌ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అన్ని రాజకీయ పక్షాల మద్దతూ కూడగట్టారు. ప్లాంట్‌ పరిపాలనా భవనం ముట్టడిరచారు. ప్లాంట్‌ గేట్లను దిగ్బంధం చేశారు. అంతా కలిసి ఢల్లీి వెళ్లి అక్కడ కూడా ధర్నాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వచ్చి కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఇక్కడ కార్మికులు పోరాటం చేస్తుంటే.. అక్కడ పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పుండు విూద కారం చల్లినట్లుగా ప్రకటనలు చేస్తోంది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధాన మిస్తూ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ముందుకు వెళుతున్నామని చాలా విస్పష్టంగా చెబుతోంది. ఈ క్రమంలో ప్లాంట్‌ అమ్మకంలో భాగంగా ట్రాన్సాక్షన్‌, లీగల్‌ సలహాదారుల నియామకాల కోసం నోటిషికేషన్‌ ఇచ్చింది. దీంతో ఉక్కు ఉద్యమం మరింత ఊపం దుకుంది. ఇదే సమయంలో కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల ప్రైవేటీకరణకు యాజమాన్యం టెండర్లు పిలవడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణకు అనుమతించేది లేదని చెబుతున్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ దాదాపు పది నెలలుగా సాగుతున్న ఉద్యమానికి మహిళా సంఘాల ఐక్య వేదిక మద్దతు ప్రకటించింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడా కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయకపోయినా.. ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను అమ్మే యడానికి ప్రధాని మోదీ యత్నించడం దారుణమని.. ప్రజలంతా ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎంపీలు అందరూ కలసి స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్మికుల ఐక్య పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. ఆనాడు తెలుగు ప్రజలందరూ విశాఖ ఉక్కు కోసం ఉద్యమించారు. ఆనాడు సాగిన పోరులో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కూడా విద్యార్థి నాయకుడిగా నాటి ఉద్యమంలో ముందుండి పోరాడారు. గాంధేయవాది అమృతరావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రజలంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పోరాటంలో పాల్గొన్నారు. ఫలితంగా నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగొచ్చి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకరించింది. అప్పట్లో విశాఖ ఉక్కు కోసం దాదాపు 40 గ్రామాల ప్రజలు 25 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. విశాఖ ఉక్కును అమ్మకానికి పెడుతున్నట్టు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. ఎవరెంతగా ఆందోళన చేసినా విశాఖ ఉక్కు అమ్మకం జరిగి తీరుతుందని ప్రకటించారు. కేందప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు ఉద్యమించాయి. ప్రజలందరి సమస్య అని తెలుసుకునేలోపే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయి. దాంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని ఆందోళనకారులు ప్రకటించారు.

Other News

Comments are closed.