మళ్లీ అడ్డు తగిలిన డ్రాగన్‌

share on facebook

– మసూద్‌ ఉగ్రవాది అనడానికి ఆధారాలేంటని ప్రశ్న
– మరోసారి భారత్‌ ప్రతిపాదన తిరస్కరణ
– భారత్‌, పాక్‌ వాదనలు వేరుగా ఉన్నాయి
– అన్ని దేశాలే ఏకాభిప్రాయంతో వస్తే మేం మద్దతిస్తాం
–  స్పష్టం చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌
వాషింగ్టన్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : భారత్‌ ప్రయత్నానికి డ్రాగన్‌ మళ్లీ అడ్డు తగిలింది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, జైషే-ఇ-మహమ్మద్‌ (జేఈఎం) అధినేత మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తూ అతడిపై నిషేధం విధించాలనే భారత్‌ ప్రయత్నానికి నో చెప్పింది. మసూద్‌ ఉగ్రవాది అనేందుకు సరైన ఆధారాలు లేవని డ్రాగన్‌ పేర్కొంది. మసూద్‌పై అంతర్జాతీయంగా నిషేధం విధించాలని కోరుతూ గత రెండేళ్లు భారత్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారత్‌కు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు మద్దతు తెలిపాయి. కానీ వీటో అధికారం కలిగిన చైనా మాత్రం మసూద్‌ను వెనకేసుకొస్తూ భారత్‌ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. తాజాగా.. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి నిషేధం విధించాలని భారత్‌ మరోసారి పిటిషన్‌ వేయగా.. దానికి డ్రాగన్‌ అడ్డుతగిలింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌  మాట్లాడుతూ.. అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో వస్తే మేం దానికి మద్దతు ఇస్తాంమని అన్నారు. కానీ మసూద్‌ విషయంలో భారత్‌, పాకిస్థాన్‌ వాదనలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. మసూద్‌ ఉగ్రవాదని భారత్‌ అంటుంటే.. పాక్‌ వాదన మాత్రం వేరేగా ఉందని, అందుకే మసూద్‌పై నిషేధం విధించాలనే పిటిషన్‌ను నిరాకరిస్తున్నామని అన్నాడు. సరైన ఆధారాలు లేకుండా ఓ
వ్యక్తిని ఉగ్రవాది అని నిషేధించలేమని వాంగ్‌ యి వెల్లడించారు. భారత్‌తో మాకు సత్సంబంధాలు ఉన్నాయంటూనే.. డ్రాగన్‌ పాక్‌ను వెనకేసుకొచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్‌ చేస్తున్న పోరాటాన్ని డ్రాగన్‌ అభినందించింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చైనా అన్ని విధాలుగా పోరాడుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో పాక్‌ను మేం ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాం. వారికి మద్దతుగా నిలుస్తాం అని వాంగ్‌ పేర్కొన్నారు. 2016లో భారత్‌లోని ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు 17 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి మసూదే. అందుకే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, అతడిపై నిషేధం విధించాలని రెండేళ్ల క్రితం నుంచి భారత్‌ ప్రయత్నిస్తూనే ఉంది. గత జనవరిలో అమెరికా కూడా మసూద్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదన ప్రవేశపెట్టగా.. దానికి సాంకేతిక కారణాలు చూపించిన డ్రాగన్‌ పక్కనపెట్టేసింది. ఆ తర్వాత ఆగస్టులో దానిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. తాజాగా మసూద్‌ ఉగ్రవాది అనేందుకు సరైన ఆధారాల్లేవంటూ ప్రతిపాదనను తిరస్కరించింది. మసూద్‌ అజహర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే-ఇ-మహమ్మద్‌ ఐక్యరాజ్యసమితి నిషేధిత సంస్థల జాబితాలో ఉంది.

Other News

Comments are closed.