మళ్లీ పత్తినే నమ్ముకున్న రైతులు

share on facebook

వరంగల్‌,జూలై27(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 6 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేస్తారు. పత్తితో తీవ్ర నష్టం కల్గుతోందని, దానికి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని అధికారులు గతేడాది సూచించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలో రైతులు కంది, పెసర, మిరప, మొక్కజొన్న, పసుపు పంటల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచారు. అయితే పంట చేతికి వచ్చాక తెలసింది. పత్తికన్నా మరీ ఘోరంగా ధరలు ఉన్నాయని. దీంతో ఈ యేడు మరోమారు పత్తినే నమ్ముకున్నారు రైతులు. మళ్లీ పెద్ద ఎత్తున పత్తిని నాటారు. గత సీజన్‌లో అధికారుల మాటలు నమ్మి పత్తిని తగ్గించి ఆ స్థానంలో ఇతర పంటలు వేసిన రైతులు లబోదిబోమన్నారు. వాటికి సరైన ధరలు లేక బెంబేలెత్తారు. జనగామ, ఎనుమాముల, కేసముద్రం మార్కెట్‌ యార్డుల్లో మొన్నటి వరకు కందుల కొనుగోలు కేంద్రాలు సరిగా నడవక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతేడాది కందులకు మంచి ధర లభించింది. క్వింటాకు రూ. 10వేలకు వరకు వచ్చిన సందర్భాలున్నాయి. దీని దృష్ట్యా ఈ ఏడాది వరంగల్‌ అయిదు జిల్లాల వ్యాప్తంగా రైతాంగం దీని వైపు మొగ్గు చూపింది. గతంతో పోలిస్తే దాదాపు 24 వేలకు పైగా ఎకరాల్లో అధికంగా సాగైంది. దిగుబడి బాగానే ఉన్నా, ధర విషయంలో మాత్రం చుక్కెదురయ్యింది. మార్కెట్‌ యార్డుల్లోకి పంటను విక్రయించడానికి వెళ్లాక ధరలేక కుదేలయ్యాన్నారు. క్వింటాకు రూ. 3000 నుంచి 4200 వరకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరో వైపు సాగుచేయొద్దన్న పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. ఇలా పత్తిసాగు చాలా తగ్గించి ఇతర పంటలవైపు మొగ్గు చూపి ప్రభుత్వం మాట విన్న రైతులు ఇప్పుడు మళ్లీ పత్తిని నమ్ముకున్నారు. ఈ యేడు తమ తమకు ఏమి కానుందో అన్న ఆందోళనలో పంటను వేశారు.

Other News

Comments are closed.