మహాకూటమికి ఓటేస్తే..  బాబు చేతిలోకి అధికారం

share on facebook


– ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు నిలిచిపోతాయి
– పాలమూరు -రంగారెడ్డిని ఆపాలని బాబు కేంద్రానికి లేఖలు రాశాడు
– సింహం లాంటి కేసీఆర్‌కు అండగా నిలుద్దాం
– నాలుగేళ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం
– సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రజలకు నమ్మకం ఉంది
– బూత్‌స్థాయి నుంచి కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలి
– మరోసారి ఆశీర్వదించండి.. అభివృద్ధిని ఉరకులుపెట్టిద్దాం
– రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌
రంగారెడ్డి, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : అపవిత్ర పొత్తులతో మహాకూటమిగా ఏర్పాటై కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ప్రజల్లోకి వస్తున్నారని, దీని వెనుక తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు ఉన్నాడని, కూటమి అభ్యర్థులకు ఓట్లేస్తే మళ్లీ చంద్రబాబు చేతిలోకి తెలంగాణ పాలన వెళ్తుందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆపాలని చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారని అన్నారు. మహాకూటమికి ఓటు వేస్తే అధికారం చంద్రబాబు చేతిలోకి వెళుతుందని కేటీఆర్‌ అన్నారు. చంద్రబాబుకు అధికారం వెళితే ప్రాజెక్టులు నిలిచిపోతాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని, మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణకు మళ్లీ నీటి సమస్య వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించామని, ప్రభుత్వ
ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఇక్కడ ప్రారంభించామని కేటీఆర్‌ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి క్యాడర్‌ లేదని, కాంగ్రెస్‌ పార్టీకి లీడర్‌ లేడని ఎద్దేవా చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. ఆ రెండు పార్టీలు 67 ఏళ్లు పాలించి నీళ్లివ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టాయని, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నాలుగేళ్లలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి టీఆర్‌ఎస్‌ పార్టీ నీరు ఇస్తుందన్నారు. తెలంగాణలో సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రి కావాలా?… సింహం లాంటి కేసీఆర్‌ కావాలా అని అడిగారు. 50 ఏళ్ళ కాంగ్రెస్‌ పాలన, 17 ఏళ్ల టీడీపి పాలన కంటే నాలుగేండ్ల మూడు నెలల టీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి ఎక్కువని అన్నారు. గత ప్రభుత్వాలు కరెంటు కోతలతో రైతులను ఏడిపించాయని, సీఎం కేసీఆర్‌ 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నారని చెప్పారు.
గత కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టుల పేరుతో కవిూషన్లు పంచుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కట్టకుండానే రూ.8000 కోట్లతో కాలువలు మాత్రమే తవ్వి ఒక్క ఎకరానికి కూడా నీరివ్వకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపారని చెప్పారు. నేడు రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగు నీరందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం ముమ్మరంగా సాగుతోందన్నారు. నీళ్లున్న చోటే ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేశారు. రైతులు అప్పుల పాలవ్వకుండా తల ఎత్తుకు తిరగాలన్నదే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆశయమని కేటీఆర్‌  అన్నారు. అప్పుల కోసం కాదు లాభాలు దాచుకోవడానికి రైతులు బ్యాంకులకు వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అందుకే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుండి వృద్దాప్య పెన్షన్ల అర్హత వయస్సును 57సంవత్సరాలకు తగ్గిస్తామని, తద్వారా మరింత మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.

Other News

Comments are closed.