మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి మృతి

share on facebook

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
నల్లగొండ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి(101) మృతిచెందారు. అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
శ్రీనివాసరెడ్డి 1962లో సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 900 ఎకరాల భూస్వామి ఇంట్లో పుట్టిన శ్రీనివాసరెడ్డి అప్పట్లో తన ఇంటి నుంచే భూపంపిణీని ప్రారంభించారు. సాయుధ పోరాటంలో ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో ర్దదైన యోధుల్లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. వృద్దాప్య అనారోగ్య బాధలతో ఆయన మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. నంద్యాల శ్రీనివాస్‌ రెడ్డి వృద్దాప్య సమస్యల కారణంగా అనారోగ్యం  ఉదయం కన్నుమూశారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో అనేక ఉన్నత విలువలు నెలకొల్పారని సీఎం ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఆయన మృతిపట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నంద్యాల సేవలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నంద్యాల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కొనియాడారు. సాయుధ పోరాటంలో దళ కమాండర్‌గా ఆయన చూపిన తెగువ వర్తమానానికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. అటువంటి ఉద్యమ నేతను కోల్పోవడం బాధకరమన్నారు. వారసత్వంగా వచ్చిన భూములను పేద ప్రజలకు పంచిన మహానేత అన్నారు. నంద్యాల స్ఫూర్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

Other News

Comments are closed.