మానవతప్పిదాలతోనే అడవుల్లో మంటలు

share on facebook


ప్రమాదాల్లో వృక్ష,జంతుజాలం దగ్ధం
ఆర్పేందుకు బ్లోయర్లు అవసరం
వరంగల్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ఎండాకాలంలో కార్చిచ్చు కారణాలు అనేకమని,ఇందులో మానవ తప్పిదాలుఎక్కువని అటవీ అధికారులు అభిప్రాయపడ్డారు. కొందరు చేసే తప్పిదాలకుఅడవులు, అటవీ సంపద, వృక్షజాతులు, వన్యప్రాణులు బలవుతున్నాయని అన్నారు. దట్టమైన అడవిలో మంటల కారణంగా అడవితల్లి ఒడిలో జీవిస్తున్న పశుపక్ష్యాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పక్షులు చెట్లలో పెట్టే గూళ్లు, గుడ్లు, వాటి ఆవాసాలు నాశనమవుతున్నాయి. ఎన్నో చెట్ల విత్తనాలు కాలిపోతున్నాయి. వాటి కింద మొలిచిన మొక్కలు మంటల కారణంగా మాడి పోతున్నాయి. ఫలితంగా నానాటికీ అడవుల్లో విలువైన చెట్ల జాతులు అంతరించిపోతున్నాయి. ఇలాంటి విపత్తులు క్రమంగా జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. కొన్ని అగ్నిప్రమాదాలు సహజ సిద్ధం కాగా మానవ తప్పిదాలతోనే భారీగా అటవీ సంపద నాశనమవుతోంది. పశువుల కాపరులు బీడీలు తాగి నిర్లక్ష్యంగా పారవేసినా మంటలు చెలరేగుతున్నాయి. అటవీశాఖ వారు అప్రమత్తమై పశువుల కాపారుల నుంచి బీడీలు, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకుని, వాటిని అడవిలోకి తీసుకెళ్లకుండా పంపాలి.  ఇప్పపువ్వు సేకరణకు ఇదే అనువైన సమయం కావడంతో వాటి కింద ఉన్న చెత్తను తొలగించకుండా కాల్చి వేస్తారు. వెలుగు కోసం జంతువులు రాకుండా జాగ్రత్త కోసం మంటలు వేస్తారు. పువ్వు సేకరించి మంటలను ఆర్పకుండా వచ్చేయడం వల్ల చుట్టుపక్కల వ్యాప్తి చెందుతున్నాయి. అడవిలో చెట్లకు లభించే చిన్న, పెద్ద తేనే తీయడానికి కాగడాలను ఉపయోగిస్తున్నారు. తునికి చెట్లకు నిప్పు పెట్టిన తరువాత నాణ్యమైన ఆకు రావడంతో వాటిని గుత్తేదారులు అక్కడక్కడ కాల్చి వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటవీశాఖ వారు సంబంధిత అటవీ బీట్‌ కల్లెదారు పరిధిలో అడవులు కాలిపోకుండా సంబంధిత తునికాకు గుత్తేదారులు బాధ్యత వహించే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంది.ఇలాంటి మానవ తప్పిదాల వల్ల అడవి తల్లికి ముప్పు వాటిల్లుతుంది. ఇలానిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న అగ్ని
ప్రమాదాల్లో ప్రకృతి సంపద కాలి బూడిదవుతోంది. కారణాలేవైనా విలువైన అటవీ సంపదకు అపార నష్టం వాటిల్లుతోంది. గుట్టల్లో జంతువులు పరిగెత్తినప్పుడు చిన్న రాళ్లు దొర్లడం, ఒకరాయి మరో రాయి విూద పడి రాపిడికి గురై నిప్పు రాజుకుని మంటలు చెలరేగే ప్రమాదం  కూడా ఉంది. వెదురు చెట్ల మధ్య ఒక్కదాని కొకటి తగిలి రాపిడి కారణంగా నిప్పు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి కొన్ని అగ్ని ప్రమాదాలు సహజంగా జరుగుతుండగా, మరికొన్నింటికి మానవ తప్పిదాలే కారణమవుతున్నాయి.
2019లో రాష్ట్రంలో 12 జిల్లాల్లో అటవీ ప్రాంతాల్లో అడవులు దహనమైనట్లు జీఐఎస్‌ నివేదికలు సంబంధిత అటవీశాఖలకు పంపాయి. 1794 చోట్ల అగ్గిరాజుకుంది. కవ్వాల్‌ టైగర్‌ అడవుల్లో 559 మంటలు రగిలిన
ప్రాంతాలు, ఆమ్రాబాద్‌ అడవుల్లో 376 చోట్ల, నిజామాబాద్‌లో 369 చోట్ల ఆదిలాబాద్‌లో 38, వరంగల్‌ జిల్లాలో 75 చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా కవ్వాల్‌ అభయారణ్యంలోని ఖానాపూర్‌, పెంబి, ఉడుంపూర్‌లో అత్యధికంగా ఆకురాలడంతో మంటలు చెలరేగి అడవులు దగ్ధమయ్యాయి. నేరడిగొండ మండలంలోని ఆరెపెల్లి, తాండ్రా, వాంకిడి, రాజురా, ఇంద్రవెల్లి, బెల్లంపల్లి డివిజన్‌లో తిర్యాణి, కాగజ్‌నగర్‌, బెజ్జూర్‌, జన్నారం డివిజన్‌లో దొంగపల్లి, అల్లినగర్‌, బజార్‌హత్నూర్‌ బీట్‌ పరిధిలోని డెడ్రా, గిరిజాయి, రత్నాపూర్‌ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ నిప్పు రాజుకుంటుంది. మంటలు వ్యాప్తి చెందినప్పుడు  గాలిని అదుపులోకి తీసుకు వచ్చి మంటలను బ్లోయర్ల ద్వారా అదుపు చేస్తున్నారు. కానీ ఒక్కో సెక్షన్‌కు ఒకటి ఉండాల్సి ఉండగా అటవీ రేంజిల పరిధిలో బ్లోయర్‌ల కొరత ఉంది. అన్ని రేంజిలకు బ్లోయర్‌లను పంపిణీ చేయలేదు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించిన వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది బ్లోయర్‌ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ఏర్పాట్లు చేశారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలను నియంత్రించడానికి అటవీశాఖ అప్రమత్తమవుతోంది. ప్రమాదాలను వెంటనే తెలుసుకునేందుకు శాటిలైట్‌ పద్ధతిని వినియోగిస్తోంది.

Other News

Comments are closed.