మాయాకూటమి మాటలు నమ్మొద్దు: వేముల

share on facebook

కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మాయమాటలు చెప్పే మాయా కూటమి మాటలు నమ్మొద్దని టీఆర్‌ఎస్‌ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచి పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయని, వాటిని పూర్తి చేయించుకునే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు.  ప్రజల వద్దకు కూటమి నాయకులు మాయమాటలతో వస్తున్నారని వారిని నమ్మి మోసపోవద్దన్నారు. కేసీఆర్‌ చేపట్టిన పథకాలను తాము అమలు చేస్తామని చెబుతున్నారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు, వారు పాలించిన సమయంలో ప్రజా సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు 24గంటల కరెంటు, రైతులకు గోదావరి జలాలు అందించాలని, ఇంటింటికీ నల్లా బిగించి నీరు అందించాలనే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నించాలని కోరారు. కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు చేతిలో పని ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో గుర్తించాలని కోరారు. తెలంగాణను నట్టేట ముంచిన చంద్రబాబుతో టీ కాంగ్రెస్‌ నాయకులు జతకట్టి ప్రజల ముందుకు వస్తున్నారని, వారిని తరమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి ఓటు వేయాలని కోరారు.

Other News

Comments are closed.