మార్చి 31నాటికి ప్రతీ పల్లెకు విద్యుత్‌ను అందిస్తాం

– కాంగ్రెస్‌ హయాంలో గొప్పలు చెప్పి అమలు చేయలేకపోయారు
– ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్‌ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సౌభాగ్య స్కీమ్‌ పై దేశ ప్రజలతో లైవ్‌ లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా ఎన్నో ప్రాంతాలకు కరెంట్‌ సరఫరా లేదన్నారు. గత ప్రభుత్వం చేసిందేవిూ లేదని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్‌కు సంబంధించి ప్రభుత్వ ఘనతలను చెబుతూ ‘2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2009 కల్లా ప్రతి గ్రామానికి విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని హావిూ ఇచ్చింది. అయితే అందులో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరో అడుగు ముందుకేసి ప్రతి ఇంటికి విద్యుత్‌ తీసుకొస్తామని హావిూ ఇచ్చారని.. అయితే ఇందులో ఏ ఒక్క హావిూని వారు నెరవేర్చలేకపోయార’న్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ తీరును మోడీ తప్పుబట్టారు. అయితే తమ ప్రభుత్వం అలా
కాదని.. 2018, ఏప్రిల్‌ 28 వరకే అన్ని గ్రామాలను విద్యుత్‌ సదుపాయం కల్పించామని మోడీ తెలిపారు. మార్చి 31, 2019 నాటికి ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, సముద్ర మార్గంలో లైన్లు వేసి తాము విద్యుత్‌ అందిస్తున్నామని అన్నారు. పర్యాటకంగా ఇండియాను అభివృద్ది చేస్తున్నామని మోడీ చెప్పారు.