ముక్కోణపు పోటీ దిశగా తెలంగాణ

share on facebook

ముందస్తు ఎన్నికల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయం రసకందాయకంలో పడింది. శాసనసభ రద్దు మొదలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల ప్రభావం పలుజిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తులతో ముందుకు వెళ్లేలా అన్ని పార్టీలో ఆలోచన చేస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ ఎలాంటి పొత్తులు లేకుండా బరిలోకి దిగబోతున్నది. బిజెపి కూడా అసమ్మతి నేతలను పార్టీలోకి రప్పించి టిక్కెట్లు ఇవ్వాలని చూస్తోంది. ఇకపోతే కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమిగా పోవాలని మిగతా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. ఇందులో ఎవరు లబ్దిపొందుతారన్నది ముందుముందు జరిగే పరిణమాలను బట్టి తెలియనుంది. ఇకపోతే అన్ని పార్టీల్లోనూ అసమ్మతి సెగలు బలంగా ఉన్నాయి. ఇది ఎవరికి లాభం అన్నది త్వరలోనే తేలనుంది. అయితే అధికార పార్టీలో తొలుత అసమ్మతి బలంగా కనిపిస్తోంది. పాతకాపులకే టిక్కెట్లు ఇవ్వడంతో ఇంతకాలం పార్టీని వెన్నింటి ఉన్నారు తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు. ఇవేవీ లేక్క చేయ కుండా అన్ని జిల్లాల్లో అధికారపార్టీ అభ్యర్థులు టికెట్‌ వచ్చిన ఉత్సాహంతో ప్రచారంరంగంలోకి దూకుతుండగా ప్రతిపక్ష పార్టీలు ఎత్తుల పొత్తుల్లో మునిగిపోతున్నారు. ఎక్కడ ఎవరు నిలబడితే గెలుస్తారన్న విశ్వేషణలో కాంగ్రెస్‌ ఉంది. ఆయా పార్టీల్లో అసమ్మతి నేతలు వస్తే టిక్కెట్లు ఇచ్చేలా బిజెపి కాచుకుని కూర్చుంది. అన్ని పార్టీల్లో అసమ్మతితో తమకు లబ్ది చేకూరుతుందన్న ధీమాలు కమలనాధులు ఉన్నారు. అన్నింటి అధికరాపక్షమే ధీమాగా ఉంది. ఓ పక్క ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనలు,మరోవైపు ప్రదర్శనలు, వ్యక్తిగత ప్రచారాలతో దూసుకుని పోతున్నారు. మరోపక్క విజయం కోసం ధీమాగా సాగుతున్నారు. ఏదిఏమైనా అన్ని పార్టీలూ గెలుపే లక్ష్యంగా అడుగులేస్తున్నాయి. ఆ దిశగానే ఆలోచిస్తున్నాయి. మొత్తంగా జిల్లాల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలు సందడిగా మారాయి. కార్యకర్తలతో పాటు నేతల రాకపోకలతో సందడి కనిపిస్తోంది. దీంతో నిత్యం రాజకీయం మరింత వేడెక్కింది. తెరాస అభ్యర్థులు ద్విచక్ర వాహన ర్యాలీలు, నేతలతో సమావేశాల్లో మునిగిపోయారు. ప్రతిపక్ష నేతలు ఆయా పార్టీ అధినేతలతో మంతనాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, సీపీఎం, జనసేన, తెజస తదితర పార్టీల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కలసి పోరాడాలన్న భావన వ్యక్తం అవుతోంది. ఉమ్మిగా వెళితే తప్ప టిఆర్‌ఎస్‌ను ఢీకొనలేన్న భానవ క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ నేతలకు తెదేపాతో పొత్తుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ తెదేపా నేతలతో ఇప్పటికే దీనిపై చర్చించారు. పొత్తుల గురించి నేతలతో మాట్లాడారు. తప్పనిసరిగా గెలుస్తామన్న సీట్లనే అడగాలని,ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా విజయం సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా సమన్వయ, ప్రచార, మ్యానిఫెస్టో కమిటీలను వేశారు. పార్టీ సమన్వయ కమిటీలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రచార కమిటీలో సత్తుపల్లి తాజా మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్యకు బాధ్యతలు అప్పగించారు. తెతెదేపా అధ్యక్షుడు రమణ కూటమి ఏర్పాటుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని ఆహ్వానించటంతో వారు సమావేశం అయ్యారు. ప్రతిపక్షాలు పొత్తులపై ఆసక్తి చూపడంతో జిల్లాల్లోని ఆయా స్థానాల్లో ఎవరికి ఎన్ని దక్కుతాయన్న ఉత్కంఠ ఆయా పార్టీ నేతల్లో నెలకొంది.

ముందస్తు ఎన్నికలకు పోవడం ద్వారా ప్రతిపక్షాలకు కూడదీసుకోవడానికి, వ్యూహం రూపొందించు కోవడానికి తగిన వ్యవధి లేకుండా చేయగలిగామన్న ఆనందం టిఆర్‌ఎస్‌లో కనపడుతోంది. ముందస్తుపై నిర్ణయానికి వచ్చే ముందు రాష్ట్రంలో నాలుగైదుసార్లు కెసిఆర్‌ తన స్వంత ఏజన్సీలతో ప్రజాభిప్రాయంపై

సర్వే జరిపించారు. ఆ సర్వేలలో ఇప్పుడున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 60 శాతం మందిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి వున్నట్లు తేలింది. ఈ సారి వారిలో చాలా మందికి మళ్లీ సీట్లు రాకపోవచ్చుననీ విూడియాలో ప్రచారాలు జరిగాయి. ఒకరిద్దరు మినహా సిట్టింగ్‌లకే తిరిగి పార్టీ టిక్కెట్లు ప్రకటించిన కెసిఆర్‌ ఆ ఊహా గానాలకు తెరదించారు. ఇకపోతే తెలంగాణలో ఏర్పడిన మొట్టమొదటి ప్రజా ప్రభుత్వం అయిదేళ్లూ పూర్తి చేసుకోకుండానే ముగిసిన తీరు కూడా ప్రజల్లో ఇప్పుడు చర్చ సాగుతోంది. ఎందుకు ముందుకు వెళ్లారో సిఎం కెసిఆర్‌ చెప్పిన కారనాలు ప్రజలకు ఒంటబట్టడం లేదు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలన్న నిర్ణయం వెనుక అంతా తానే అన్న తీరున కెసిఆర్‌ వ్యవహరించారు. అసెంబ్లీని రద్దు చేసే ప్రకటన విషయంలోనేగాక వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలోనూ కెసిఆర్‌ వ్యవహారశైలి పార్టీలో కూడా కొంత అసంతృప్తిని కలిగిస్తోంది. ఇవన్నీ రేపటి ప్రచారంలో ఎలా ముందుకు తీసుకుని వెళతారన్నది చూడాలి. ప్రస్తుతానికి టిఆర్‌ఎస్‌ రాజకీయంగా పైచేయి సాధించినట్టు అనిపించ వచ్చు. కానీ తీర్పు ఇచ్చే ప్రజలు ప్రచారం నాటికి ముగిసి ఎన్నికల్లో ఓటేసేసనాటికి ఎలా ఆలోచిస్తారన్నది తెలియదు. తెలంగాణ ఏర్పడ్డాక అనేక రకాల ఆశలను కల్పించారు. ఎలా అభివృద్ధిని సాధించవచ్చునో చెప్పి ప్రజలల్లో కొత్త ఆశలు నింపారు.గడిచిన నాలుగు న్నరేళ్ల కాలంలో ప్రజల ఆశలను, ఆకాంక్షలను ఏ మేరకు నెరవేర్చ గలిగారన్నది ఇప్పుడు చర్చనీయాం శంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వచ్చేస్తాయని ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇంత వరకూ కెసిఆర్‌ చూపిన ఉపాధి కల్పన ఏదీ లేదు. ఇవే ఇప్పుడు విపక్షాలకు ప్రధాన ప్రచారాశంగా మారనున్నాయి. వీటిని బలంగా ప్రచారంలోకి తీసుకుని వెళ్లేందుకు విపక్షాలు అప్పుడు ప్రచార ఉధృతిని పెంచింది. క్షేత్రస్థాయిలో సామామజిక మాధ్యమాలు ఇందుకు బాగా దోహదం చేస్తున్నాయి.

Other News

Comments are closed.