ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు..  ఇచ్చితీరుతాం

share on facebook


– కేంద్రంలో బీజేపీ రాజకీయ కుట్రతో అడ్డుకుంది
– ముస్లింల అభివృద్ధికి రూ.2వేల కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌ది
– కాంగ్రెస్‌, తెదేపా కుట్రలను తిప్పికొట్టండి
– వెంకట్రావ్‌ గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం
– ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ
– కొత్తగూడెంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మహమూద్‌అలీ
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్‌6(జ‌నంసాక్షి) : కేసీఆర్‌ మాట ఇచ్చిన ప్రకారం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని, ఆ మేరకు కేంద్రంతో పోట్లాటకైనా సిద్ధంగా ఉన్నామని ఆపద్దర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్‌ లో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో మహమూద్‌ అలీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కొత్తగూడెం తెరాస అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుతోపాటు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. తెరాస భాజపాతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, దీనిపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్షాలు తమ పబ్బం గడుపుకొనేందుకు
ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని నమ్మవద్దన్నారు. ముస్లింల సంక్షేమం కోసం రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఉందో లేదో తెలియని భాజపాతో తెరాస ఎలా పొత్తు పెట్టుకుంటుందనే విషయాన్ని ప్రతిపక్షాలు విస్మరించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్‌, తెదేపాలు సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినప్పటికీ ముస్లింల సంక్షేమాన్ని విస్మరించారని తెరాస ప్రభుత్వం వారి సంక్షేమం కోసం రూ.కోట్లు కేటాయించదన్నారు. రాష్ట్రంలో తమ ఉనికి చాటుకునేందుకు రేవంతర్‌రెడ్డిని తెదేపా పావుగా వాడుకుంటోందని అలీ అన్నారు. కాంగ్రెస్‌, తెదేపా ముస్లింలకు ద్రోహం చేశాయని, వాటికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం రూ.వేల కోట్లు కేటాయించడంతోపాటు, నిరుపేద ముస్లింల పిల్లల విద్యబుద్దులందించేందుకు 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. బడ్జెట్‌లో రూ.900కోట్లు కేటాయించిందన్నారు.  జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీలు తెరాసకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. జలగం వెంకట్రావ్‌.. మాట్లాడుతూ గత ఎన్నికల్లో మైనార్టీలు ఇచ్చిన సహకారం మరువలేనిదని, ఈ సారి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మైనార్టీ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో తెరాస జిల్లా అధ్యక్షుడు బుడాన్‌బేగ్‌, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.