మెదక్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఎవరికో

share on facebook

శశిధర్‌ రెడ్డికి మళ్లీ మొడిచేయేనా?

ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల్లో టెన్షన్‌

మెదక్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మెదక్‌ కాంగ్రెస్‌కు దక్కుతుందా లేక టిఎజెస్‌కు కేటాయిస్తారా అన్నది తేలలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి, భట్టి జగపతిలు మాత్రం ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఎవరికి వారు తమకే టిక్కెట్‌ అన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు గజ్వెల్‌ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి మెదక్‌ కేటాయించనున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ టిక్కెట్‌ విషయంలో మరోమారు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డికి భంగపాటు తప్పేలా లేదు. గత ఎన్నికల్లో విజయశాంతి రాకతో ఆయన ఆశలకు గండిపడింది. ఇప్పుడు

మళ్లీ కొత్త ఎత్తుల కారణంగా శశిధర్‌ రెడ్డికి మొడి చేయి చూపేలా ఉన్నారు. కాంగ్రెస్‌కా? లేక టీజేఎస్‌కా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇరు పార్టీలు తమదంటే తమదని ప్రచారం కూడా మొదలు పెట్టారు. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. వాళ్లు కూడా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. శుక్రవారం ప్రకటించిన రెండో జాబితాలో మెదక్‌, నర్సాపూర్‌ టికెట్‌ విషయంలో స్పష్టత వస్తుందని శ్రేణులు భావించాయి. కానీ ఈ జాబితా లోనూ జిల్లా అభ్యర్థుల పేర్లు లేవు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగు తోంది. కార్యకర్తలు కూడా వెనకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులపై ఇంకా స్పష్టత రావడం లేదు. పార్టీ శ్రేణుల్లో సైతం అధినాయకత్వంపై అసంతృప్తి కనిపిస్తోంది. మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల నుంచి మొదటి జాబితాలోనే అభ్యర్థులను ఖరారు చేస్తారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అందుకు విరుద్ధంగా రెండో జాబితాలోనూ ప్రకటించ లేదు. ఎన్నికలు సవిూపిస్తున్నా.. అభ్యర్థులను ప్రకటించక పోవడంతో ప్రచారం కూడ చేయలేని పరిస్థితి నెలకొంది. మెదక్‌ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌ యాదవ్‌, జిల్లా నాయకులు కటికె శ్రీనివాస్‌, తాళ్లపల్లి రాజశేఖర్‌, నందారెడ్డి తదితరులు టికెట్‌ను ఆశిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు జాతీయ నాయకుడు మురళీధర్‌రావును కలిసి తమకు టికెట్‌ ఇవ్వాలని కోరారు. అధిష్టానం ఇటీవలే నియోజకవర్గ నాయకులతో సమావేశమై ఎమ్మెల్యే అభ్యర్థిపై అభిప్రాయం కూడా సేకరించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య సైతం మెదక్‌ నుంచి బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధిష్టానానికి వివరించగా వారు సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే టికెట్‌ ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే ఇవ్వాలని మెదక్‌ నియోజకవర్గ నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అభ్యర్థి పేరు ఎంత త్వరగా ప్రకటిస్తే పార్టీకి అంత మేలు జరుగుతుందని ఆశావాహులు భావిస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని వారు అధిష్టానం పెద్దలను కోరారు. నర్సాపూర్‌ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేదు. నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి గోపి, రఘువీర్‌ రెడ్డిలు టికెట్‌ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్‌ దక్కే అవకాశాలున్నాయి.

 

Other News

Comments are closed.