మొక్కలను నాటేందుకు దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

share on facebook

కామారెడ్డి,జూలై10(జ‌నంసాక్షి): వాతావరణంలో అసమానతలు తొలగించేందుకు పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు పెంపకం తప్పనిసరి అని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని అన్నారు. ఇది లాభాపేక్ష లేని కార్యక్రమంగా చూడాలన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు ఏదైనా గ్రామాన్ని దత్తతగా భావించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. వ్యాపార దృక్పథంతో చూడకుండా సమాజానికి ఏదైనా పది కాలాల పాటు మేలు కలిగేలా ఉండే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ వారంలో గుంతలు తీసి రెండో వారంలో మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కల కోసం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి ఇండెంట్‌ పంపాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని భావితరాలకు పచ్చదనం, ఆరోగ్యకర సమాజాన్ని అందించాలని అన్నారు. నేషనల్‌ హైవే అథారిటీ వారు ఒక వారంలోగా చెల్లించాల్సిన 86 లక్షలు డిపాజిట్‌ చేస్తే అటవీ శాఖ వారు మొక్కలు నాటడం చేపడుతారని తెలిపారు. 56 కి.విూ పొడవున్న నేషనల్‌ హైవే వెంబడి మొక్కలు పెద్ద ఎత్తున నాటడం జరుగుతుందని తెలిపారు. అడ్లూర్‌, ఎల్లారెడ్డి చెరువును 2 కి.విూ మేర మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. ఇకపోతే ప్రతీ గ్రామంలో ఈజీఎస్‌ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతామని డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.ప్రతీ గ్రామంలో ఈజీఎస్‌ అధికారులతో నర్సరీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతీ గ్రామంలో స్థలాలను ఎంపిక చేస్తున్నామన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వన సంరక్షకుల ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతామన్నారు. ముందుగానే ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. హరితహారంలో భాగంగా ప్రతీ గ్రామంలో 40 వేల మొక్క లు నాటనున్నట్లు చెప్పారు.

Other News

Comments are closed.