మోడీ,షాల నాయకత్వానికి పరీక్ష 

share on facebook

సర్వేలన్నీ బిజెపికి ఎదురుగాలి వీస్తున్నాయనే చెబుతున్నాయి. మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాగా వేస్తుందనే చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో బొటాబొటిగా బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అక్కడా జ్యోతిరాదిత్యను నేతగా ప్రకటిస్తే కాంగ్రెస్‌ గెలుపు అవకాశాల్లో మార్పు రావచ్చని అంటున్నారు. అయితే ఇదంతా రాహుల్‌ ప్రతిభనో లేక.. సోనియా ప్రతిభనో కాదు. అధికార బిజెపిపై మండిపడుతున్న ప్రజలు తక్షణం ఆ పార్టీని సాగనంపాలని నిశ్చియించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు చేస్తున్న రంకెలు చూస్తుంటే ప్రజలే ఆశ్చర్య పోతున్నారు. ఎపిలో కూడా అంతే. ఈ రెండు రాష్ట్రాలకు బిజెపి ఏవిూ ఒరగబెట్టలేదు. కనీసం అధిరకారంలో ఉన్న మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే సర్వేలు కమలనాథులకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఓటమి చెందితే ఇప్పుడది స్వయంగా మోడీ, అమిత్‌షాల ఓటమిగా భావిస్తారు. దీంతో వారు మరోమారు తమ చాణక్యాన్ని ప్రయోగించి ఎలాగైనా అధికారంలోకి వచ్చేలా చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. ఐదేళ్లుగా వీరు అధికారంలో ఉండి కాంగ్రెస్‌ను ఎందుకు తిట్టి పోస్తున్నారో అర్థం కావడం లేదు. అందుకే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నిజంగా భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్ష లాంటివి. ఇక్కడ గెలిస్తేనే ఢిల్లీ ఫీఠం పదిలంగా ఉంటుంది. వీరి నాయకత్వానికి తిరుగుండదు. లేకుంటే మోడీ ద్వయాన్ని పక్కకు నెట్టేందుకు బిజెపిలో కాచుకు కూర్చున్నారు.  2014 తర్వాత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ, అమిత్‌ షాయే రంగంలోకి దిగారు. స్థానిక నాయక త్వాలకు అంత ప్రాధాన్యతనీయలేదు. ప్రతి ఎన్నికనూ మోదీకీ, కాంగ్రెస్‌కు  మధ్య సమరంగానే పోల్చారు. అందుకే ఇప్పుడు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌లో కూడా మోదీ, అమిత్‌ షాలు సుడిగాలిలా తిరుగు తున్నారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్రాల్లో గెలుపోటముల బాధ్యత వారే తీసుకున్నారు.  ఇప్పుడు  గెలుపోటములకు వారు స్థానిక నాయకత్వాలతో పాటు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే బిజెపి కేంద్రంలోనూ, ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నందువల్ల ప్రజలకు స్థానిక ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతతో పాటు కేంద్ర ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తోడయ్యిం ది. ఇప్పుడిదే వారికి పెద్ద మైనస్కాబోతున్నది. గతంలో మోదీ ఏదైనా  రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తే అది స్థానికంగా ఆ పార్టీకి కొంత ఉపయోగపడింది. కాని ఇప్పుడు ఆ విధంగా ఉపయోగం కలుగుతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే కొన్ని సర్వేలు చెప్పినట్లు ఈ మూడు రాష్టాల్లో బిజెపి పరాజయం చెందితే అది మొత్తంగా మోదీ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుంది. ఇంతకాలం అరచేతిలో వైకుంఠం చూపిన మోదీ ఇప్పుడు ప్రచారంలో కనిపిస్తే బిజెపికి మైనస్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన నాయకత్వమే ఇప్పుడు దేశంలో  చర్చనీయాం శంగా  మారుతోంది. దేశంలో కాంగ్రెస్‌ విముక్త భారత్‌ పిలుపును ఆహ్వానించిన ప్రజలకు ఇప్పుడు మోడీ విముక్త్‌ భారత్‌ అన్న రాహుల్‌ ప్రచారం ఆకట్టుకుంటోంది. ప్రతిపక్ష ఐక్యత లేకుండా చేయాలన్న మోడీ ప్రయత్నాలకు ఈ ఎన్నికల ఫలితాలతో గండి పడునుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలవడం వల్ల మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పార్టీలు కాంగ్రెస్‌ పట్ల సానుకూల ధోరణితో ఉండక తప్పదు. ఓ రకంగా ఈ ఎన్నికలు రాహుల్‌కు అదృష్టం కలసి వచ్చేలా చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికీ  పొత్తున్నా లేకున్నా లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి పోటీనిచ్చేది కాంగ్రెస్‌ మాత్రమే అన్నది బలపడగలదు.  పైగా కాంగ్రెస్‌కు,బిజెపికి ముఖాముఖి పోటీ జరుగుతుంది. మరో రకంగా
ఇంతకాలం తన మాటలతో మభ్య పెట్టిన మోడీ నాయకత్వాన్ని అంగీకరించడానికి బిజెపిలో ఎవరు కూడా సిద్దంగా ఉండకపోవచ్చు. మోదీ నాయకత్వం బలహీనమైతే బిజెపిలో ఇంతకాలం మౌనంగా ఉన్న నేతలు తమ గళాన్ని పెంచడం ఖాయం. 2019లో బిజెపికి మెజారిటీ రాకపోతే… అన్న ప్రశ్న వరకు ఆగరు. ఈ ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా రావడంతోనే మోడీ హఠావో నినాదం దేశంలో మొదలవ్వడంతో పాటు సొంత పార్టీలో కూడా ఊపందుకుంటుంది. మోదీ స్థానంలో నాయకత్వానికి పోటీపడే బిజెపి నేతలు తమ ప్రయత్నాలను బహిరంగంగానే సాగిస్తారు. అందువల్ల ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడమన్నది మోడీ, అమిత్‌షాలకు అత్యవసరం. అలాగే అద్వానీ లాంటి సీనియర్‌ నేతలకు మళ్లీ ప్రాధాన్యం ఏర్పడు తుంది. వారు నేరుగా నాయకత్వం చేపట్టకున్నా తరవాతి తరాన్ని ప్రోత్సించేలా ముందు వరసలో నిలబడతారు. ఇవన్నీ ఇప్పుడు మోడీ కళ్ల ముందు కనపడుతూ ఉంటాయి. అందుకే ఈ రాష్ట్రాల్లో ఎలాగైనా గెలవడమెలా అన్న వ్యూహాల్లో ఉన్నారు. ఈ మూడు రాష్టాల్లో కాంగ్రెస్‌ గెలవకుండా విశ్వ  ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సర్వేలు చెప్పినట్లుగా మూడు రాష్టాల్లోన్రూ బిజెపి ఓడిపోతే పార్లమెంట్లో ప్రతిపక్షాలు విజృంభిస్తాయి. ఇప్పటికే రాఫెల్‌పై ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంటుంది. అవసరమైతే జెఎసి వేయాల్సి ఉంటుంది. ఇందుకు బిజెపిలోని వారు కూడా సిద్దంగానే ఉన్నారు. ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్నట్లుగా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవకతకవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా దర్యాప్తుకు ఒప్పుకోకపోతే మోడీని అంత తేలిగ్గా వదిలి పెట్టరు. ఓ రకంగా రాహుల్‌కు, మోడీకి మధ్య ఫైట్‌గా ఈ ఎన్నికలు మారబోతున్నాయి. ఇందులో ఎవరు నెగ్గితే వారే రేపటి దేశాధినేతగా ఉంటారు.

 

Other News

Comments are closed.