మౌనం వ‌హించిన ఈ డైనమిక్ ఎమ్మెల్యే

share on facebook
maxresdefault పార్టీ మారుతాడా..
        మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యుడు ఎస్.ఏ.సంపత్‌కుమార్. ఈయన ఆషామాషీ నేత కాదండి బాబు. సంపత్‌ అన్న పేరు ఉచ్ఛరిస్తే చాలు వైబ్రేషన్స్‌ పుడతాయి. ఆయన గళమెత్తితే చాలు… ప్రకంపనలు చెలరేగుతాయి. అలంపూర్‌లో ఆయన గెలిచింది మొదలు నేటి వరకూ ఇదే పంథా! ఇదే దూకుడు..!!
          అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే సంపత్‌ అధికారపక్షాన్ని ఇరుకునపెడుతూ వచ్చారు. టీ-కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల్లో ఒక్కొక్కరు గులాబీ కండువా కప్పుకుంటున్నా ఆయన మడమ తిప్పలేదు. పైగా వలసలపై విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ని టార్గెట్‌ చేస్తూ వచ్చారు.
               ఈ క్రమంలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. ఆ వెంటనే పాలమూరులో కొత్త జిల్లాల డిమాండ్ ఊపందుకుంది. ఇందులో ప్రధానంగా గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లాను ఏర్పాటుచేయాలని గద్వాల ఎమ్మెల్యే, మాజీమంత్రి డి.కె.అరుణ ఉద్యమాన్ని చేపట్టారు. ఇందులో సంపత్ కూడా క్రియాశీలకపాత్ర పోషించారు. గత నెలలో గద్వాల నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర చేపట్టి అందరిలో కదలిక తెచ్చారు. పనిలో పనిగా ఎమ్మెల్యే సంపత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, అధికారపక్ష నేతలపైన తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. “సీఎంకి చెమ్చాగిరీ చేసే వారి మాటలు విని, వనపర్తిని జిల్లాగా చేస్తామని ప్రకటిస్తున్నారనీ, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనీ” బాహాటంగానే సవాళ్లు విసిరారు. గద్వాల, అలంపూర్ టీఆర్‌ఎస్ నేతలను అయితే అనరాని మాటలే అన్నారు. “జిల్లా ప్రకటన చేయకుండా పుష్కరాలకు ముఖ్యమంత్రి వస్తే నిలదీస్తామని” హెచ్చరికలు కూడా చేశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ సీఎంనీ, టీఆర్‌ఎస్ నేతలను నడిగడ్డ యాసలో పరుష పదజాలంతో ఎండగట్టి స్థానికుల నోట శహబాష్‌ అనిపించుకున్నారు సంపత్‌.
           అనుకున్న ముహూర్తం రానేవచ్చింది. కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్‌ని వేదిక చేసుకున్నారు. జోగుళాంబ క్షేత్రానికి దగ్గరలో ఉన్న గొందిమళ్ల ఘాట్‌ను ఈ శుభకార్యానికి ఎంపికచేసుకున్నారు. కాదు కాదు.. కోరి మరీ అక్కడ ప్రత్యేక ఘాట్‌ను నిర్మింపచేసి సీఎం కేసీఆర్‌ అక్కడికే వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. 11వ తేదీ సాయంత్రం అలంపూర్‌కి చేరుకున్న కేసీఆర్‌కి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ప్రత్యేక ఆహ్వానం పలికారు. తర్వాతి రోజు ఉదయాన్నే తొలిస్నానం ఆచరించేందుకు కేసీఆర్ ఘాట్‌కి రాగా ఆయన వెంట స్నానంచేసే అవకాశం సంపత్‌కే లభించింది. తదనంతరం ఆలయాల దర్శనానికి వెళ్లినప్పుడు కూడా సంపత్ సీఎం వెన్నంటే ఉన్నారు. అనంతరం గెస్ట్‌హౌజ్‌లో ఏకాంతంగా ముఖ్యమంత్రితో గంటసేపు భేటీ అయ్యారు. మీడియా సమావేశానికి ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు కోర్కెలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని సీఎంకి అందచేసి.. పక్కకు జరుగుతుండగా కేసీఆర్ సంపత్‌ని చేయిపట్టి లాగి తన సరసన కూర్చోబెట్టుకున్నారు. అక్కడే ఉన్న మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఈ సన్నివేశాన్ని చూసి అవాక్కయ్యారు.
             ఇంతటితో ఈ కథ ముగియలేదు. సంపత్‌ కోరిందే తడవుగా అలంపూర్ క్రాస్‌రోడ్డులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కేసీఆర్‌ ఓకే అన్నారు. ఆలయాల అభివృద్ధికీ, మినీ డిపో ఏర్పాటుకి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు తన ప్రసంగంలో సంపత్‌గారూ.. సంపత్‌గారూ అంటూ ముఖ్యమంత్రి పదేపదే ప్రస్తావించారు. ఈ పరిణామం కూడా చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యమంత్రి ఏమి మాయ చేశారోగానీ.. ఆ తర్వాత రోజునుంచి సంపత్‌లో మార్పు కనిపించింది. అధికారపక్షంపై పిడుగులు పడటం లేదు. పైగా, బీచుపల్లి ఘాట్‌కి గద్వాల ఎమ్మెల్యే అరుణ వెంటరాకుండా… ఆమె వెళ్లిపోయాక… నిరంజన్‌రెడ్డి తదితరులు వచ్చిన సందర్భంలో వచ్చారు. ఇలాంటి సన్నివేశాలు.. చర్యలు ప్రతిపక్షపార్టీని కలవరపెట్టక మానవు. “హస్తం పార్టీకి సంపత్‌ కొంపదీసి చెయ్యివ్వరు కదా..” అంటూ కాంగ్రెస్‌ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఏదేమైనా.. సంపత్ సైలెన్స్ అనేక ప్రశ్నలకు తావిస్తోందన్న మాట వాస్తవం.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>