మ‌హిళ‌లకి ప్ర‌మాద‌క‌రంగా నంబ‌ర్ 1 స్థానంలో భార‌త్‌

share on facebook
దిల్లీ(జ‌నం సాక్షి): మహిళల భద్రతకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వే నివేదిక భారత దేశ‌ ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారతదేశమేనని థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్స్‌ సర్వే వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా మూడో స్థానంలో ఉంది. నిత్యం యుద్ధ వాతావరణంతో వణికిపోతున్న అఫ్గానిస్థాన్‌, సిరియాల కంటే కూడా మన దేశంలో మహిళలకు భద్రత కరువైందని సర్వేలో వెల్లడించడం మరింత మింగుడుపడని అంశం. అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బలవంతంగా బానిసలుగా చేసి పనిచేయించుకోవడం, వేధింపులు తదితర కారణాల వల్ల భారత్‌ మహిళలకు ప్రమాదకరమైన దేశంగా మారిందని సర్వే వెల్లడించింది.సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 550 మంది నిపుణులను ప్రశ్నించి ఈ జాబితా సిద్ధం చేశారు. లైంగిక హింస, వేధింపులు, మహిళలను లైంగికంగా బలవంత పెట్టడం, అక్రమ రవాణా, లైంగిక బానిసలు, ఇంటి పనులకు బానిసలుగా చేయడం, బలవంతపు వివాహాలు, బ్రూణహత్యలు తదితర విషయాల్లో మహిళలకు ఎక్కడ ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులను ప్రశ్నించి జాబితా తయారు చేసినట్లు రాయిటర్స్‌ వెల్లడించింది. ఈ సారి వచ్చిన నివేదిక దాదాపు 2011లో వచ్చిన నివేదిక మాదిరిగా ఉందట. అప్పుడు అఫ్గానిస్థాన్‌, కాంగో, పాకిస్థాన్‌, భారత్‌, సోమాలియా దేశాలు మహిళలకు అత్యంత ప్రమాదకరమని తేలాయి. ఈ ఏడాది భారత్‌లో మహిళలకు ప్రమాదం బాగా పెరిగిందని సర్వే వెల్లడించింది.

‘భారత్‌లో మహిళల పట్ల నిర్లక్ష్యం, అగౌరవం ఎక్కువయ్యాయి. అత్యాచారం, లైంగిక వేధింపులు, వివాహ బంధంలోనూ అత్యాచారాలు, ఆడపిల్లల బ్రూణహత్యలు చాలా పెరిగాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఖగోళ శాస్త్రంలో దూసుకుపోతోంది, కానీ మహిళల పట్ల జరుగుతున్న హింస సిగ్గు చేటు’ అని ఓ వ్యక్తి వెల్లడించినట్లు సర్వే పేర్కొంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. దేశంలో 2007 నుంచి 2016 మధ్య మహిళలపై జరిగిన నేరాలు 83శాతం పెరిగాయి. ప్రతి గంటకు నాలుగు కేసులు నమోదవుతున్నాయి.

Other News

Comments are closed.