రాజీనామా చేయను.. 

share on facebook

విూరే సస్పెండ్‌ చేయండి
– సస్పెండ్‌ చేయడం చేతకాకుంటే తీర్మానాన్ని వెనక్కుతీసుకోండి
– నాకునేనుగా రాజీనామాచేస్తే విూ ఆరోపణలు నిజమనుకుంటారు
– నాకుటుంబాన్ని అసత్యాలతో రోడ్డుకీడ్చారు
– లేనిపోనివి కల్పించి సంజయ్‌ను జైళ్లో పెట్టించారు
– ఎప్పుడు, ఎక్కడ పార్టీని బలహీనపర్చానో చెప్పాలి
– రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్‌
నిజామాబాద్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : తాను టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనని, కావాలంటే నాపై ఆరోపణలు రుజువుచేసి అధిష్టానమే నన్ను సస్పెండ్‌ చేయండని రాజ్యసభ టీఆర్‌ఎస్‌ ఎంపీ డీ శ్రీనివాస్‌ అన్నారు. నిజామాబాద్‌లో మంగళవారం డీఎస్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేను రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్తే విూరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుందని, నన్ను సస్పెండ్‌ చేయడం చేతకాకపోతే తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. తనను రాజకీయంగా దెబ్బ తీశారని, నా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని డీఎస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే లేనిపోనివన్నీ కల్పించి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి నా కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారని ఆరోపించారు.
హైకోర్టు 41ఏ నోటీసు ఇచ్చినా ఆ ఆర్డర్‌లు పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఇందులో ప్రభుత్వం ఎంత ఆసక్తి తీసుకుందో అందరికీ అర్ధమవుతోందని డీఎస్‌ అన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎప్పుడు ఎక్కడ పార్టీని బలహీన పరిచానో నిరూపించాలని కోరారు. నేను బీజేపీకి ఎలా ఉపయోగపడ్డానో, బీజేపీకి నా సహచరులను ఎవరిని పంపానో చూపించాలని పేర్కొన్నారు. నేను టీఆర్‌ఎస్‌లో ఉండటం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు, ఎంపీ కవితకు ఇష్టం లేకపోతే దయచేసి నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని చెప్పారు. తెలంగాణ కోసం సమైక్యవాదులకు వ్యతరేకంగా పోరాడానని అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా కేసీఆర్‌ ఉన్న సభలోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించానని డీఎస్‌ గుర్తు చేశారు. తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వాదించానన్నారు. తన కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరతాడని కేసీఆర్‌కు ముందే చెప్పానని, బీజేపీలోకి వెళ్లాలని తన అనుచరులకు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు.

Other News

Comments are closed.