రాఫెల్‌ ఒప్పందంలో మరో చీకటి కోణం 

share on facebook

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇప్పుడు కాకున్నా రేపైనా ప్రధాని మోడీ సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. రాఫెల్‌ విమానాల కొనుగోలును ఎవరూ వద్దనడం లేదు. ఈ యుదద్ద విమానాలు కావాలనే దేశం కోరుకుంటోంది. అయితే ఈ ఒప్పందాన్ని కేవల్‌ అనిల్‌ అంబానీ కంపెనీకి కట్టబెట్టడంలో ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సుప్రీం సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి కీలకమైన ప్రశ్నలు సంధించింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందంలో సావరిన్‌ గ్యారంటీని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందని, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ నిబంధన ఎందుకు లేదని ధర్మాసనం ప్రశ్నించింది. రాఫెల్‌ యుద్ధవిమానాలను తయారుచేసే దసో ఏవియేషన్‌ గనక ఒప్పందానికి కట్టుబడక సొమ్ము వెనక్కి చెల్లించలేకపోతే దాని తరఫున ఫ్రెంచి ప్రభుత్వం ఆ సొమ్మును చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వ హావిూ సావరిన్‌ గ్యారంటీ నిబంధనను చేర్చడం ఆనవాయితీ. కానీ ఫ్రాన్స్‌ ఆ హావిూ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతిగా ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ను తీసుకొని భారత్‌ సంతృప్తిపడింది. ఈ విషయాన్ని నిరుడు నవంబరు 15నే సుప్రీంకోర్టుకు తెలియపర్చినపుడు ఆ లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ అనేది చట్టప్రకారం చెల్లదని పిటిషనర్లు వాదించారు. కానీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ మాత్రం ఆనాడు అది సావరిన్‌ గ్యారంటీతో సమానమని వాదించారు. తాజాగా ఇది మళ్లీ తెరపైకొచ్చింది. దీనికి మళ్లీ వేణుగోపాల్‌ బదులిస్తూ- ఇది కొత్తదేం కాదు. అమెరికా, రష్యాలతో కూడా గతంలో ప్రభుత్వాలు చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటికీ ఈ హావిూ నుంచి మినహాయింపును ఇచ్చాయని వివరించారు. దీంతో ఈ ఒప్పందం విషయంలో ఇప్పడు మోడీ ప్రభుత్వం రెండు తప్పులను చేసినట్లు బాహాటంగా బయటపడింది. అనిల్‌ అంబానీ కంపెనీ ఆధీనంలోని ఆర్‌కామ్‌ దివాళా ప్రకటించింది. అలాగే ఎరిక్సన్‌ కంపెనీకి 500 కోట్లు చెల్లించాల్సి రావడం, సుప్రీం తీర్పు నేపథ్యంలో అనిల్‌ అన్న ముఖేశ్‌ అంబానీ ఆదుకున్నాడు. ఇలాంటి దివాళా కంపెనీకి రాఫెల్‌ లాంటి యుద్దవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని కట్టబెట్టడంలో ఔచిత్యం లేదు. దీనిపై పార్లమెంట్‌ వేదికగా, బహిరంగంగా శరపంరగా ప్రశ్నలు వచ్చినా మోడీ తప్పించుకున్నారు. ఇప్పటికీ సమాధానం చెప్పలేక పోయారు. అంటే అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజాగా సుప్రీం లేవనెత్తిన అంశం కూడా కీలకమే. ప్రాన్స్‌ ప్రభుత్వం హావిూ లేకుండా ఒప్పందం చేసుకోవడం వల్ల వచ్చే ముప్పును ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానం చెప్పాల్సిన విషయాన్ని పక్కన పెట్టి, సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు అంశంపై బదులిస్తూ కోర్టుకు సాంకేతిక అంశాలపై ప్రశ్నించే అధికారం లేదని వేణుగోపాల్‌ తేల్చిచెప్పారు. రాఫెల్‌ ఒప్పందంపై కేంద్రానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీంకోర్టు నిరుడు డిసెంబరు 14న ఇచ్చిన తీర్పుని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌లు సవాలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణను చేపట్టినపుడు ఈ ప్రశ్నలు వచ్చాయి. తొలుత వాదనలు వినిపించిన ప్రశాంత్‌ భూషణ్‌ తాము రాఫెల్‌ ఒప్పందాన్ని రద్దు చేయమని కోరలేదని, ఆ ఒప్పందంలో అవినీతి గురించి దర్యాప్తు చేయించాలని మాత్రమే అడిగామని  అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న కాగ్‌ తన నివేదికను సమర్పించిందనీ, కానీ అందులో వివరాల్ని కేంద్రానికి చాలా ముందుగానే అంటే నిరుడు నవంబరులోనే ఎలా తెలిశాయో వివరించాలనీ ఆయన డిమాండ్‌ చేశారు.  ఒప్పందంలోని కొన్ని అంశాలను ప్రభుత్వం కోర్టుకు వెల్లడించకుండా దాచిపెట్టిందని, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి క్రిమినల్‌ దర్యాప్తును ప్రారంభించి ఉండాల్సిందని ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. రాఫెల్‌ ఒప్పందం జాతీయ భద్రతకు సంబంధించిన అంశమనీ, ఇలాంటి విషయాలపై ప్రపంచంలో ఎక్కడా న్యాయస్థానాల్లో విచారణ జరగదని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ ధర్మాసనానికి తెలిపారు. ఇవేవిూ అలంకారప్రాయమైన విమానాలు కావు. దేశంలో ప్రతి ఒక్కరి భద్రత కోసం ఉద్దేశించిన అత్యంత ముఖ్యమైన ఒప్పందం ఇది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విషయాలను కోర్టుల్లోకి లాగరు అని ఆయన వాదించారు. అయితే ఇంత జరిగినా ప్రభుత్వం మాత్రం అనిల్‌ కంపెనీకి  కట్టబెట్టడం, లెటర్‌ ఆఫ్‌ గ్యారెంటీ తీసుకోక పోవడంపై సంతృప్తిక సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఎందుకు చేస్తున్నారన్న దానికి మౌనమే సమాధానంగా ఉంది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం దుమారం రేపుతోంది. ఇప్పట్లో అది చల్లారేలా లేదు. ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తున్నారే తప్ప అనిల్‌ అంబానీ కంపెనీకే ఎందుకు ఒప్పందాన్ని అప్పగించార్న ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, ఎవరి కోసం అడ్డుకుంటున్నారని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఓ రకంగా రాహుల్‌ రాఫెల్‌ రగడను దేశం దృష్టికి తేవలడంలో సఫలం అయ్యారు. రేపటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇదే బ్రహ్మాస్త్రం అయితే మోడీ ఇంటికి పోక తప్పదు. ఈ మధ్య కాలంలో రాహుల్‌ మోడీని నేరుగా దొంగా అంటూ దుయ్యబడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా రాహుల్‌ సంధించిన ఈ బ్రహ్మాస్త్రం ఓ రకంగా మోడీకి ఉచ్చు బిగిస్తోంది. బిజెపి శ్రేణుల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి. రాఫెల్‌ యుద్ద విమానాలు కొనుగోలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ దివాలా తీసిన  అంబానీ కంపెనీకి వేలకోట్ల ఒప్పందం ఎందుకు కట్టబెట్టారన్నదానికి మోడీ సమాధానం చెప్పడం లేదు. బోఫోర్స్‌ కుంభకోణం కాంగ్రెస్‌ పుట్టి ముంచినట్లే రాఫెల్‌ ఒప్పందం బిజెపిని, మోడీని ముంచేలా ఉంది.

Other News

Comments are closed.