రాఫెల్‌ ఢీల్‌ వివరాలివ్వండి

share on facebook

– ఈనెల 29లోగా వివరాలను కోర్టుకందించాలి
– కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : రాఫెల్‌ ఢీల్‌ వివరాలను కోర్టుకు అందజేయాలని సుప్రింకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. గత కొద్దిరోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారిసిన, వివాదాస్పదంగా మారిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా రాఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకున్న పక్రియ గురించి వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, సాంకేతిక అంశాలకు సంబంధించిన వివరాలు అవసరం లేదని కోర్టు వెల్లడించింది. అక్టోబరు 29లోగా ఆ వివరాలను వెల్లడించాలని చెప్పింది. మేము కేంద్రానికి నోటీసులు జారీ చేయడం లేదని, పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకోవడం లేదని
స్పష్టం చేస్తున్నామని కోర్టు తెలిపింది. వారి వాదనలు ఆమోదయోగ్యంగా లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే రఫేల్‌ ఒప్పంద నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. దేశ రక్షణ అంశమైనందున వ్యయాల విషయాన్ని అడగబోమని కోర్టు స్పష్టం చేసింది. భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.59వేల కోట్లతో 36యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ వాదించారు. ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిందని, దీన్ని రాజకీయం చేస్తున్నారని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

Other News

Comments are closed.