రాఫెల్‌ రహస్యం రట్టు

share on facebook

దిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన వ్యాఖ్యలతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసో ఏవియేషన్‌ సంస్థకు సూచించిందని హోలన్‌ చెప్పినట్లు ఫ్రెంచి పత్రిక మీడియాపార్ట్‌ వెల్లడించింది. అయితే ఈ వార్తలను తాజాగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఖండించింది. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచి కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేసింది.

‘భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని మేం కంపెనీలను భాగస్వాములుగా ఎంచుకోం. రాఫెల్‌ ఒప్పందంలో మా పాత్ర కూడా ఏం లేదు. ఒప్పందాల కోసం సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్‌ కంపెనీలకు ఉంటుంది. ఏ సంస్థకు సామర్థ్యం ఉందని భావిస్తే వాటినే మా కంపెనీలు ఎంచుకుంటాయి. అప్పుడు భారత ప్రభుత్వ అనుమతిని కోరుతాయి’ అని ఫ్రాన్స్‌ ప్రభుత్వం వెల్లడించింది. భారత చట్టాలకు అనుగుణంగానే ఈ ఒప్పందాలు జరిగాయని పేర్కొంది. ఈ ఒప్పందంపై హోలన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

రాఫెల్‌ ఒప్పందంలో డసో ఏవియేషనే తన భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో హోలన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఒప్పందం కోసం రిలయన్స్‌ డిఫెన్స్‌ గ్రూపు పేరును భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని హోలన్‌ చెప్పినట్లు మీడియాపార్ట్‌ పేర్కొంది. తమకు మరో అవకాశం లేకపోవడం వల్లే ఇచ్చిన భాగస్వామిని తీసుకున్నాం అని హోలన్‌ చెప్పినట్లు తెలిపింది.

ఇది మా నిర్ణయమే: డసో ఏవియేషన్‌

మరోవైపు హోలన్‌ వార్తలను డసో ఏవియేషన్‌ కూడా ఖండిస్తోంది. రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవడం పూర్తిగా తమ నిర్ణయమేనని చెబుతోంది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నాం. ‘రాఫెల్‌ ఒప్పందం కోసం మేం రిలయన్స్‌ను ఎంచుకున్నాం. ఇది మా నిర్ణయమే. మా నిర్ణయంతోనే మేం కొనసాగుతాం’ అని డసో ఏవియేషన్‌ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Other News

Comments are closed.