రాష్ట్రంలో రైతుబంధు చెక్కుల చప్పుడు

share on facebook

దేశంలో కనుక రైతులు అలిగి… ఈ దండగమారి వ్యవసాయం మనకెందుకులే అని అనుకుంటే….నష్టాలతో సేద్యం చేయడమెందుకులే అని ఆలోచిస్తే..అందరిలాగే తానూ ఏదో పట్నం వెళ్లి పనిచేసుకుంటూ పొట్ట పోసుకుంటానని నిర్ణయించుకుంటే..ప్రజల గతేం కాను…నోట్లోకి ముద్ద దిగేదెలా.. తలచుకుంటేనే భయం వేస్తుంది. వ్యవసాయం పడావుపడితే ప్రజలకు అన్నపానీయాలు దొరకవు…ఆధునిక యువతకు వ్యవసాయంపై బొత్తగా అవగాహన లేకపోవడం కూడా మనకు ప్రమాదమే…అందుకే వ్యవసాయాన్ని ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి. అప్పుడే ప్రజలకు అవగాహన పెరుగుతుంది. బ్యంకులను ముంచినోళ్లను..కంపెనీలు పెట్టి రుణాలు ఎగ్గొట్టినోళ్లను చూస్తుంటే రైతులకు ఎంత చేసినా తక్కువే. వారిలో నైరాశ్యం నెలకొంటే ప్రపంచానికే ప్రమాదం. ఇది తెలిసిన నేతగా సిఎం కెసిఆర్‌ తొలినాళ్ల నుంచే వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఆలోచనతో కార్యాచరణకు దిగారు. రైతు అలిగితే మంచిది కాదని ఆయనకు తెలుసు. పాలకులు అన్నవారు ఇలాంటి ఆలోచనే చేయాలి. రైతులకు అలక రాకుండా.. వారు నైరాశ్యం చెందకుండా వెన్నుతట్టి ప్రోత్సహించాలి. తెలంగాణలో చేపట్టిన రైతుబంధు పథకం ఇలా రైతులు నైరాశ్యంలో మునగకుండా చేసిన పనిగానే చూడాలి. వారికి అందించిన పెట్టుబడి ప్రోత్సాహకం అన్నది వారిలో భరోసా కల్పించేందుకు ఉద్దేశించినదిగానే భావించాలి. ఇదేదో ఎన్నికల జిమ్మిక్కనో లేదా మరేదో అనేవారు రైతులను తక్కువ చేస్తున్నారని అనుకోవాలి. రైతులకు కావాల్సింది సకాలంలో నీరు రావడం.. నిరంతరాయంగా విద్యుత్‌ అందుబాటులో ఉండడం..పెట్టుబడి కోసం బ్యాంకులు విరవిగా రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ సక్రమంగా జరిగిన తరవాత పంటలను ఎలాంటి పేచీ లుకుండా కొనుగోలు చేయడం.. ఇలా చేస్తే మన పొలాల్లో వారు బంగారాన్నే పండిస్తారు. అందుకే రైతులు కన్నీరు పెట్టకుండా కర్చీఫ్‌ అందించారు సిఎం కెసిఆర్‌. ఆయన ఇచ్చి ప్రోత్సాహం ఇప్పుడు వారిలో ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. రాష్ట్రంలోని రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోని లేని విప్లవత్మాకమైన పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని గురువారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కావడం నిజంగా పండగలా సాగింది. ఈ వారం రోజుల పాటు రైతుల ఇంట పండగ వాతావరణం ఉండనుంది. వ్యవసాయం దండుగ అన్న నానుడి నుంచి వ్యవసాయం పండుగ అనేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్క రైతు రుణపడి ఉంటారు. కవిూషన్లకు కక్కుర్తి పడి, ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా లక్షకోట్లు ఖర్చుపెట్టి నిధులు దిగమింగిన వారికి  నిజంగా ఇది అర్థం కాని వ్యవహారంగానే ఉంటుంది. కేవలం ఓట్ల దృష్టితో చూసే వారికి ఇది ఓట్ల పండగ లాగనే ఉంటుంది. ఇది ఓట్లు కొల్లగొట్టే పథకమే అనిపిస్తుంది. అయితే ఎవరేమనుకున్నా తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి ఈ చెక్కుల పంపిణీ అన్నది పండగ కాక మరోటి కాదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచని, ఊహించని పథకం ఇదని చెప్పవచ్చు. ఈ పథకంతో సిఎం కేసిఆర్‌ దేశానికి కొత్త దారి చూపారు. రైతులను ఆదుకునేందుకు ఎలా బాటలు వేయాలో చెప్పారు.  కొత్త చరిత్రకు నాంది పలికారు. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ గొప్ప ఆశయంతో తీసుకొచ్చిన రైతు బంధు పథకం కేవలం ఓ ముందడుగు మాత్రమే. చెరువుల పునురుద్దరణ కార్యక్రమాలు పూర్తయి, ప్రాజెక్టులు సాకారం అయితే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుంది. మూలనపడ్డ కులవృత్తులకు జీవం వస్తుంది. రైతులు బాగుపడితే మొత్తం గ్రామమే బాగుపడుతుంది. తెలంగాణలో ఇదే జరగబోతున్నది. ఆరు దశాబ్దాల పోరాటం,అమరుల త్యాగ ఫలితం, సిఎం కేసిఆర్‌ నాయకత్వంలో ఎంతో 
కష్టపడి తెచ్చుకున్నతెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకునేందుకు సిఎం కేసిఆర్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గత నాలుగేళ్లలోనే తన పరిపాలన దక్షతతో చేపట్టిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. అందరి దృష్టి తెలంగాణ వైపు ఆకర్షించేలా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయం పరిస్థితి,ప్రస్తుత వ్యవసాయ పరిస్తితి చూస్తే మనకు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.  గతంలో రైతులకు కనీసం నాలుగుగంటలు కూడా కరెంటు రాక, విత్తనాలు, ఎరువులు దొరకక చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చేసే రోజులను అప్పుడే ఎలా మరచిపోగలం. తొలుత  తెలంగాణలో పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయానికి ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయనో లేదా పీజులు ఎగిరి పోయాయనో సబ్‌స్టేషన్ల వ్ద ఆందోళనలను ఒక్కటంటే ఒక్కటి కూడా చూడలేదు. ఈ నాలుగేళ్లలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో పాటు 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను దేశంలో ముందువరసలో నిలబెట్టారు. అదేవిధంగా రైతులకు లక్ష రూపాయలలోపు పంట రుణాల మాఫీని కూడా చేసిచూపారు. పంటరుణాలను నాలుగువిడతలుగా 17వేలకోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాల కోసం క్యూలైన్లలో నిలబడే ఖర్మ లేకుండా చేశారు. ఇక నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అన్న నినాదం ఎత్తుకున్న సిఎం కేసిఆర్‌ దీనిని నిజం చేసేందుకు ప్రాజెక్టులను జెట్‌ వేగంతో నిర్మిస్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల పనుల వేగం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి అయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రూపు ర ఏఖలు మారుతాయి. గ్రామాలు మళ్లీ జీవం పొందుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. హరితహారంతో పచ్చగా కనిపిస్తాయి. ఇలాంటి వాతావరణం చూడడానికి మరెంతో దూరం లేదని గుర్తించాలి.

Other News

Comments are closed.