రేపు రైతు ట్రాక్టర్‌ ర్యాలీలు

share on facebook

– జనవరి 26కు ఇది ట్రైలర్‌

– ప్రభుత్వాన్ని హెచ్చరించిన రైతుసంఘాలు

దిల్లీ,జనవరి 5(జనంసాక్షి): కేంద్రంతో రైతు సంఘాల చర్చల ప్రతిష్ఠంభనతో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 7న ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. ముందుగా జనవరి 6న ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఒక రోజు వాయిదా వేసినట్లు వారు తెలిపారు. అంతే కాకుండా జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా దిల్లీకి పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీని జరుపుతామన్నారు. జనవరి 7న జరిగే ర్యాలీ గణతంత్ర దినోత్సవాన జరిగే ర్యాలీకి ట్రైలర్‌గా అభివర్ణించారు. స్వరాజ్‌ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్‌ సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం జరిగే ర్యాలీలో దిల్లీ నాలుగు సరిహద్దుల్లో మోహరిస్తామని తెలిపారు. రేపటి నుంచి రెండు వారాల పాటు ‘దేశ్‌ జాగరణ్‌ అభియాన్‌’లో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. సోమవారం జరిగిన చర్చల్లో సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండటంతో గతంలో ప్రకటించిన విధంగా ట్రాక్టర్ల ర్యాలీ చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. మరోవైపు కేంద్రం, రైతు సంఘాల మధ్య ఎనిమిదో విడత చర్చలు జనవరి 8న జరగనున్నాయి.

కిసాన్‌ పరేడ్‌’ కోసం ట్రాక్టర్‌ ఎక్కిన మహిళలు

సాగు చట్టాలపై తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఇందులో భాగంగానే గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో ‘కిసాన్‌ పరేడ్‌’ పేరుతో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ పరేడ్‌లో మహిళలు కూడా భాగస్వాములు కానున్నారు. ఇందుకోసం వారు ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. హరియాణాలోని జింద్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 500 మందికి పైగా మహిళలు ట్రాక్టర్లు నడపటంలో శిక్షణ తీసుకుంటున్నారు. వీరంతా బుధవారం కుండ్లీ-మనేసర్‌-పల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ర్యాలీ చేపట్టనున్నారు. జనవరి 26న దిల్లీలో చేపట్టే కిసాన్‌ పరేడ్‌లో వీరంతా ట్రాక్టర్లు నడుపుతూ ఆందోళనల్లో పాల్గొంటారని కిసాన్‌ యూనియన్‌ జిల్లా నాయకులు తెలిపారు. మహిళలు డ్రైవింగ్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌విూడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పటికే దిల్లీ శివారుల్లో కొనసాగుతున్న ఉద్యమంలోనూ పలువురు మహిళలు పాల్గొన విషయం తెలిసిందే. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము వెనక్కి తగ్గేది లేదని, చట్టాలు రద్దు చేసేదాకా సరిహద్దుల నుంచి వెళ్లబోమని మహిళా రైతులు చెబుతున్నారు. అటు.. సాగు చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు విఫలమయ్యాయి. చట్టాలను రద్దు చేయడం కుదరదని, అయితే అందులో సవరణలు చేస్తామని కేంద్ర మంత్రులు సవివరంగా చెప్పారు. కానీ రైతు నాయకులు ఇందుకు అంగీకరించలేదు. రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో చర్చలకు జనవరి 8కి వాయిదా వేశారు.

Other News

Comments are closed.