రేవంత్‌ వ్యాఖ్యలతో టిఆర్‌ఎస్‌ ఎంపిల ఉలిక్కిపాటు

share on facebook

తాము టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదన్న ఆ ఇద్దరు ఎంపిలు

కావాలనే మైండ్‌ గేమ్‌ ఆడాడన్న కొండా, సీతారామ్‌ నాయక్‌

హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఇద్దరు టిఆర్‌ఎస్‌ ఎంపిలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న రేవంత్‌ వార్తతో

చేరేదెవరో తెలియక ముందే ఇద్దరు ఎంపిలు మాత్రం ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాడని, ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు తగవని హెచ్చరించారు. తాము టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తానన్న వార్తలు అవాస్తవం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి,సీతారామ్‌ నాయక్‌లు కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు

ఆరోపించారు. తనకు రాజీనామా ఆలోచన లేదని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు జోరుగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని కొడంగల్‌లో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో తమ పార్టీలోకి ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు వస్తున్నారని చెప్పారు. అయితే టీఆర్‌ఎస్‌ నేతలంతా ప్రచారంలో తలమునకలై ఉండగా విశ్వేశ్వర్‌రెడ్డి ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన వెన్నంటి ఉండే ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి ప్రచారంలో ఉండగానే విశ్వేశ్వర్‌రెడ్డి పలుమార్లు వచ్చారు. కానీ, ఒక్కసారి కూడా ప్రచారంలో పాల్గొనలేదు. ఇవన్నీ కూడా రేవంత్‌ వ్యాఖ్యలకు బలం చేకూర్చాయి. కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కావాలనే తనపై దుష్పచ్రారం చేస్తున్నారని అన్నారు. ప్రగతిభవన్‌లో తాను మంత్రి కేటీఆర్‌ను కలిసినట్టు చెప్పారు. రాష్ట్రంలో నామినేషన్ల గడువు ముగిసే నాటికి ఇద్దరు తెరాస ఎంపీలు కాంగ్రెస్‌లో చేరనున్నారని, దమ్ముంటే ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ కూడా స్పష్టంచేశారు. ఇద్దరు ఎంపీలు పార్టీ మారతారంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆయనకొట్టి పారేశారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌లోకి వెళ్లే ఎంపీల పేర్లను వెల్లడించాలని ఆయన సవాల్‌ విసిరారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. తెరాస కోసం పనిచేసే వారిని ఆత్మరక్షణలో పడేసేలా మైండ్‌గేమ్స్‌ వద్దని ఆయన హితవు పలికారు. తాను తెరాసను వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. అలాంటి వార్తలు వచ్చినందుకు చాలా బాధగా ఉందన్నారు. కాకతీయ యూనివర్శిటీలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విద్యార్థులకు అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో 26 లక్షల మంది లంబాడీలు ఉన్నారని, లంబాడీలు ఎక్కడ ఉన్నారో అక్కడ తాను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రచారంలో భాగంగానే తాను కొడంగల్‌ వెళ్లానని, అంతేగానీ రేవంత్‌ రెడ్డి అన్నదాంట్లో నిజం లేదని స్పష్టంచేశారు.

 

 

Other News

Comments are closed.