రేషన్‌ డీలర్లు చేసేది సామజిక సేవే

share on facebook

సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు

చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు

తెలంగాణ తూనికలు కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌

హైదరాబాద్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : ‘రేషన్‌ డీలర్లు సామజిక సేవ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దని, వారు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, చర్చల ద్వారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ తూనికలు కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం నగరంలోని ఒక స్కానింగ్‌ సెంటర్‌ తప్పుడు పరీక్షల వల్ల ఒక శిశువు, ఆమె కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురయిందని ఆయన తెలిపారు. పాప తల్లిదండ్రులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిచడంతో.. సదరు స్కానింగ్‌ సెంటర్‌ను దోషిగా తేలుస్తూ ఫోరం 2 లక్షల జరిమానా విధించిందని అన్నారు. ఆ మొత్తాన్ని బాధిత కుంటుంబానికి చెక్కు రూపంలో గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా అకున్‌ మాట్లాడుతూ.. ఇటీవల నగరంలోని షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 12 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. వస్తు, సేవల్లో మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగదారుల సేవా కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి వ్యాపారీ అతను అందించే వస్తు, సేవలకు సంబంధించిన పూర్తి వివరాలుఅందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడే వ్యాపారులపై వినియోగదారులు 180042500333 టోల్‌ ఫ్రీ నెంబర్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. దోషిగా తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఉద్ఘాటించారు. త్వరలో కొత్త రేషన్‌ కార్డులను జారీ చేస్తున్నామని అన్నారు. డీలర్లు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, సమ్మెకు వెళ్లడం ద్వారా డీలర్లకే కాకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఇదిలా ఉంటే రేషన్‌ డీలర్లు జులై 1 నుంచి సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం ఇవ్వాలని, బయోమెట్రిక్‌ విధానంతో నష్టపోతున్నామని, దానిని తొలగించి పాత విధానాన్ని అమల్లోకి తేవాలని డీలర్లు కోరుతున్నారు. తమ సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం స్పందించకుంటే జులై నెల డీడీలు కట్టమని డీలర్లు స్పష్టం చేశారు.

 

 

Other News

Comments are closed.