రైతులను వెన్నాడుతున్న ఖరీఫ్‌ కష్టాలు

share on facebook

అకాల వర్షాలతో పంటలకు తీరని నష్టం
జగిత్యాల,నవంబర్‌8 (జనం సాక్షి) : రైతులను ఖరీఫ్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆరుగాలం శ్రమ ఆవిరైపోతోంది. పంట చేతికందే దశలో కురిసిన అకాల వర్షాలతో పంట నేలపాలు అవుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్షాల వల్ల 30 వేల ఎకరాల్లో ఇప్పటికే పంటలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల మొక్కజొన్న పంట కూడా దెబ్బతినడంతో  ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి.  వరిపంట  దిగుబడి కూడా బాగా వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈసారి చీడపీడల బెడద కూడా లేకపోవడంతో జిల్లాలో ఆరున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఈ మేరకు 320 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల కురిసిన  భారీ వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి.  అలాగే పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పంట చేతికి వచ్చే దశలో నీటిపాలు అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురియటంతో పెద్ద ఎత్తున వరి పంట నేలమట్టం కాగా, చాలా చోట్ల పత్తి పంట నీట మునిగింది. కొన్ని చోట్ల మొక్కజొన్న పంట కూడా తడిసి మొదలకెత్తుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టం జరిగినా అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అంచనా వేయలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకరిద్దరు నాయకులు పరామర్శించి వెళ్లినప్పటికీ అధికారులు పంట చేలోకి రావడం లేదని ఆరోపిస్తున్నారు.

Other News

Comments are closed.