రైతుల కన్నీరు ఏనాడైనా తుడిచారా..

share on facebook

నేతల తీరుపై మండిపడ్డ మంత్రి ఈటల
కరీంనగర్‌,మే15(జ‌నం సాక్షి ):  ప్రజా సమస్యలను, వారి కన్నీళ్లను పట్టించుకున్న పాపాన పోనీ దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ డ్రామా కంపెనీ అని దుయ్యబట్టారు.. ప్రజలు వారిని నమ్మరని ఆయన పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో చేపట్టిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు పథకం కింద రైతులకు ఇచ్చే రూ. 12 వేల కోట్లు ఎన్నికల స్టంట్‌ అని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. ఏవైనా ఆరోపణలు చేసేప్పుడు యోచించాలే. అలాంటి వాళ్లను చూసి తెలంగాణ సిగ్గు పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక రైతు రుణమాఫీ కోసం మూడు సంవత్సరాలు జమ చేస్తే ఇదీ ఎన్నికల స్టంట్‌ అన్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమాధానం చెప్పగలవా అని ఈటల ప్రశ్నించారు. రూ. 3 వేల కోట్లు విూరు ఇస్తే గొప్పొడివి అని మేము అన్నాం.. కాగా రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేస్తే తమను కాంగ్రెస్‌ నాయకులు శాపనార్థాలు పెడుతున్నరన్నారు. దాదపు 60 ఏళ్లు ఇతర పార్టీల పాలనలో ఏనాడైన 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ముఖమేనా వాళ్లదని విరుచుకుపడ్డారు. పచ్చ కామెర్లవానికి లోకం అంతా పచ్చగానే కనపడుతున్నట్లు ఉన్నది కాంగ్రెస్‌ పరిస్థితని మంత్రి ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. రైతులకు పంట పెట్టుబడిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పంట పెట్టుబడిని ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన రైతుబంధు పథకంతో రాష్ట్రంలో స్వర్ణయుగం రాబోతుందని చెప్పారు. ఏడాదికి రెండు పంటలకు గాను రూ.12 వేల కోట్లను పంట పెట్టుబడి కింద ప్రభుత్వం అందించబోతుందని తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులు బాగుంటేనే గ్రామం, రాష్ట్రం తద్వార దేశం బాగుంటుందని తెలిపారు. రైతుకు పంటపెట్టుబడి కింద ఎకరాకు రూ.4వేలు అందించడంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసే రోజులు పోతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడితో మంచి పంటలు వేసి రైతులు లాభాలు చూడాలన్నారు. వ్యవసాయానికి 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో బోర్లు కాలిపోకుండా చక్కగా పనిచేస్తున్నాయని అన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందిస్తుందన్నారు. గతంలో రైతులు విత్తనాల కోసం చెప్పులను లైన్లలో పెట్టి నిరిక్షించేవారని గుర్తుచేశారు. రైతులకు సీఎం కేసీఆర్‌ కొడుకులా, పెద్దన్నగా అండగా ఉన్నారని తెలిపారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలోనే రైతుబంధు పథకం చరిత్ర సృష్టించబోతుందన్నారు. మిషన్‌కాకతీయతో చెరువు, కుంటలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. త్వరలోనే మిషన్‌భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు వస్తాయని మంత్రి ఈటల అన్నారు.

Other News

Comments are closed.