రైతు సమన్వయ సమితులపై బృహత్తర బాధ్యత

share on facebook

రైతు సంక్షేమం లక్ష్యంగా ఏర్పాటు: పోచారం
నిజామాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రైతు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.  జిల్లా రైతు సమన్వయ సమితికి చెందిన పలువురు మంత్రితో భేటీ సందర్భంగా మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా రైతులను సంఘటిత పరిచి వారిలో చైతన్యం తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు సమన్వయ సమితులు రైతులకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలన్నారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు ద్వారా రైతులను సంఘటిత పరచడం, సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడం, కల్తీలను నిరోధించడం చేయాలన్నారు.  ప్రభుత్వానికి, రైతులకు వారధిగా సమన్వయ సమితులు పనిచేయడం, మార్కెటుకు పండిన పంటలను తీసుకువచ్చి విక్రయించడంలో రైతులను సమన్వయపరచడం కూడా వారి విధి అన్నారు. సమయాను కూలంగా ఆహార అవసరాలకు తగ్గట్లుగా డిమాండు ఉన్న పంటలను క్రాప్‌ కాలనీల ద్వారా సాగు చేయడం, రైతు పండించిన పంటలకు మద్దతు ధర అందించడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అండగా నిలవాలన్నారు.  గోదాములు, అనుబంధ కోల్డ్‌ స్టోరేజీలను వినియోగించుకోవడం ద్వారా రైతులకు మద్దతు ధర అందించడం, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, యంత్ర పరికరాలను వినియోగించడం ద్వారా పంటసాగు ఖర్చులను తగ్గిచండం కోసం ప్రభుత్వం రైతు సమన్వయ సమితిల ద్వారా కృషి చేయనున్నట్లు పోచారం తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి పంట పెట్టుబడి పథకంలో భాగంగా ఒక పంట కాలానికి ఎకరానికి రూ.4వేల రూపాయలు పెట్టుబడి డబ్బులను ప్రభుత్వం అందించనుందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి డా.రాధామోహన్‌సింగ్‌ ప్రకటించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల కాలంతో పోల్చితే తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారన్నారు.
జిల్లాలోని 63 ఏఈవో క్లస్టర్లలో వచ్చే ఏడాది వానాకాలానికి 63 రైతు వేదికలు నిర్మించన్నుట్లు తెలిపారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ.12లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వ భూములు ఉన్న చోట్ల వెంటనే భూమిని కేటాయించేలా జిల్లా కలెక్టర్‌ చొరవ చూపాలని, జిల్లాలోని అన్ని వేదికల నిర్మాణానికి ఆయా మండల, గ్రామ సమన్వయ సమితిలు స్థలసేకరణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Other News

Comments are closed.