రొహింగ్యాలు దేశానికి ముప్పు

share on facebook

– సుప్రీంకు కేంద్రం అఫిడవిట్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): రోహింగ్య ముస్లింల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. రోహింగ్య ముస్లింలు భారత్‌లో ఉండడం చట్ట విరుద్దమని తెలిపింది. వారిని భారత్‌లో ఉండనిస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని వెల్లడించింది. రోహింగ్య ముస్లింలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉందని కేంద్రం చెప్పింది. పాక్‌ ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్‌ స్టేట్‌తో లింక్స్‌ ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది. కాగా తమను శరణార్ధులుగా భావించి దేశంలో ఉండనివ్వాలని రోహింగ్య ముస్లిలు కోరారు. వారి తరఫున నారిమన్‌, కపిల్‌ సిబాల్‌ వాదించారు. అయితే చట్టప్రకారమే న్యాయస్థానం ముందుకు వెళుతుందని న్యాయమూర్తి చెప్పారు.భారత్‌-మయన్మార్‌ సరిహద్దు గుండా అక్రమంగా సుమారు 40000 మందికి పైగానే దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించిన వీరు అసాంఘిక కార్యకలాపలకు పాల్పడుతున్నారని చెప్పింది. వీరిలో కొందరు పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నారని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు కూడా కనిపెట్టాయన్న విషయాన్ని బెంచ్‌ ముందు కేంద్రం ప్రస్తావించింది. ఇది ముమ్మాటికీ మనుషుల అక్రమ రవాణా కిందకే వస్తుందన్న కేంద్రం.. రోహింగ్యా శరణార్థులను ఇక్కడ కొనసాగించటం దేశ భద్రతకు పెను ముప్పేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహరాన్ని తమకు వదిలేయాలని, చర్చలు.. విధాన నిర్ణయాల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. దీంతో ఈ కేసులో తదుపరి వాదనను కోర్టు అక్టోబర్‌ 3 కు వాయిదా వేసింది.

Other News

Comments are closed.