లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతల ఆసక్తి

share on facebook

ఖమ్మంపై కన్నేసిన రేణుకాచౌదరి
నల్లగొండపై ఇప్పటికే సిద్దమన్న కోమటిరెడ్డి
అవకాశం వస్తే మెదక్‌ బరిలో విజయశాంతి
హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఓటమి ఫలితాలను విశ్లేషించుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా లోక్‌సభ  స్థానాలు దక్కుతాయన్న ఆశలు లేవు. అయితే ఓడిన ప్రముఖులే పోటీలో ముందుంటున్నారు. దీంతో ఇంతకాలం పోటీ చేయాలని భావిస్తున్న తదుపరి లీడర్లు ఇప్పుడు వీరి నిర్ణయంపై మండిపడు తున్నారు. టిఆర్‌ఎస్‌ నుంచి గట్టి పోటీ ఉన్నా తామే గెలుసుతామన్న ధీమాతో పావులు కదుపుతున్నారు. ఇకపోతే ఖమ్మం లోక్‌సభ స్థానానికి బాగా పోటీ ఉంది. ఇక్కడ రేణుకాచౌదరి మల్లీ బరిలోకి దిగాలని చూస్తున్నారు. అధిష్టానం వద్ద ఆమెకున్న పలుకుబడి, సామాజికవర్గ సవిూకరణాల నేపథ్యంలో ఆమె పోటీకి సై అంటున్నారు. ఖమ్మం లోక్‌సభ సీటుకు ఈసారి గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు దక్కించుకున్న పూర్వపు ఖమ్మం జిల్లా టికెట్‌పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మరికొందరు నేతలు దృష్టి సారించారు. పొంగులేటి సుధాకర్‌ రెడ్డి కూడా గత అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన ఖమ్మంపై పట్టుదలగా ఉన్నారు.  రిజర్వుడ్‌ స్థానాల్లో చాలా వరకూ పాత అభ్యర్థులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సర్వేల ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిందని, దీనివల్లే అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకోలేకపోయారని పలువురు విన్నవించిన నేపథ్యంలో ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని పీసీసీ, ఏఐసీసీ భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందన్న వార్తల నేపథ్యంలో  రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నందున అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర నేతలతో సమావేశమైనపుడు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక అంశం చర్చకు వచ్చింది. బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాలని ఆయన
సూచించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో నిరుత్సాహానికి గురైన కాంగ్రెస్‌ నేతలు లోక్‌సభ అభ్యర్థిత్వాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆరుగురు మాజీ ఎంపీలు బరిలో నిలిచారు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగిలిన అయిదుగురిలో ముగ్గురు లోక్‌సభ బరిలోకి దిగడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే లక్ష్యంతో వీరివైపు పార్టీ కూడా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇకపోతే కరీంనగర్‌ అసెంబ్లీలో పోటీకి దిగి ఓటమి పాలయిన పొన్నం ప్రభాకర్‌ మరోమారు లోక్‌సభపై ఆసక్తిగా ఉన్నారని సమాచారం. అయితే టిడిపితో పొత్తు ఉంటే ఇక్కడ ఎల్‌. రమణ పోటీ చేయాలని చూస్తున్నారు. జీవన్‌ రెడ్డి కూడా పోటీకి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గత లోక్‌సభ
ఎన్నికల్లో నాగర్‌కర్నూలు స్థానం నుంచి విజయం సాధించిన నంది ఎల్లయ్య ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడి నుంచి కొత్తగా బరిలో దిగేందుకు కొందరు ముందుకు వచ్చిన అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్‌ నేతలు అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. నల్గొండ టికెట్‌పై మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తితో ఉన్నారు. మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పోటీకి మాజీ మంత్రి డి.కె.అరుణ అధిష్ఠానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమన్నారు. పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి కూడా పార్టీ ఆదేశిస్తే పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆమె గతంలో మెదక్‌  నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడుకూడా అక్కడి నుంచే పోటీకి సిద్దంగా ఉన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌పై నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ ధీమాతో ఉన్నారు. భువనగిరి టికెట్‌ను పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆశిస్తున్నారు. అవకాశం ఇస్తే మెదక్‌ స్థానం నుంచి తన సతీమణిని బరిలో దింపేందుకు సిద్ధమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆదిలాబాద్‌ సహా మరికొన్ని లోక్‌సభ స్థానాల నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఈసారి పోటీకి అవకాశం కల్పించాలని ముఖ్యనేతల్ని కలుస్తున్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బరిలో దిగాలని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల పదో తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 12వ తేదీలోపు గాంధీ భవన్‌లో బయోడేటాతో దరఖాస్తులు అందజేయాలని వివరించారు. దరఖాస్తులను పీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించి ఏఐసీసీకి నివేదిక అందజేస్తుందని తెలిపారు.

Other News

Comments are closed.