లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ నేతల దూకుడు

share on facebook

గెలుపే లక్ష్యంగా నేతలు జోరుగా ప్రచారం
పార్టీల్లో చేరికలను ప్రోత్సహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌,మార్చి26(జ‌నంసాక్షి):  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీ నాయకులు భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వరంగల్‌, మహబూబాబాద్‌,భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల బాధ్యులు మండలాల వారీగా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని మూడు స్థానాలను కైవసం చేసుకున్న స్ఫూర్తితో మూడు పార్లమెంట్‌ స్థానాల్లో విజయబావుటా ఎగురవేయడంలో కీలకంగా వ్యవహరించాలని పార్టీశ్రేణులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దిశానిర్ధేశం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెబుతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్షకు తగ్గకుండా మెజార్టీ సాధించేలా
పార్టీశ్రేణులు శ్రమించాలని పిలుపునిస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, వినయ్‌ భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి,తదితరులు నియోజకవర్గంలో పర్యటిస్తూ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న రాష్ట్ర పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరంగల్‌, భువనగిరిలో పార్లమెంట్‌ నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు హాజరయ్యారు. యువనేత పిలుపు మేరకు పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. మండలాలు, గ్రామాల వారీగా ముఖ్యనేతలను కలుపుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు.  తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు ధరిస్తున్నారుమండలాల వారీగా ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న టీఆర్‌ఎస్‌కే ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఇప్పటికే పలు పార్టీల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. రానున్న రోజుల్లో మరికొంతమంది టీఆర్‌ఎస్‌ చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

Other News

Comments are closed.