వచ్చే ఏడాది నుండి..  జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం

share on facebook


– విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
– ఆసిఫాబాద్‌లోలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రులు
కొమ్రంభీం, నవంబర్‌11(జ‌నంసాక్షి) : 2018-109 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం
విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నగేష్‌, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. గ్రామాల నుంచి వచ్చే నిరుపేద విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో.. సహచర మంత్రులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉచిత మధ్యాహ్న భోజనం అందించే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్న కడియం తెలిపారు.  వీలైతే 2018-19 విద్యాసంవత్సరంలో అమలు చేస్తామన్నారు. కేజీ టు పీజీలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 544 గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్యను అందిస్తున్నామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అనంతరం కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్‌ తరగతులను కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలను కడియం అందజేశారు. అనంతరం మైనార్టీ బాలికల వసతి గృహానికి శంకుస్థాపన చేసి.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎంపీ నగేష్‌, స్థానిక నేతలు, ఇతరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.