వర్షాభావంపై అన్నదాతల్లో ఆందోళన

share on facebook

వర్షాభావ పరిస్థితులు మరోమారు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడపదడపా పడ్డ వర్షాలతో సాగులోకి దిగిన రైతులు మళ్లీ ఆకాశం కేసి చూస్తున్న రోజులు వచ్చాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మళ్లీ బంగాళాఖాతం వైపు చూడాల్సిన దుస్తితి ఏర్పడింది. ఈ యేడు కూడా వర్షాలు పడతాయా లేదా అన్న భయం వెన్నాడుతోంది. ఎండలు మళ్లీ దంచి కొడుతున్నాయి. ఇకపోతే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కొంత ముందుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడంతో ఇంకేముంది వర్షాలే వర్షాలని వాతావరణ శాఖ ప్రచారం చేసింది. కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో తప్ప రాయలసీమలో తీవ్ర వర్షాభావ స్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో క్రమేపి వర్షాభావం పెరగనారంభించింది. మధ్యలో ఏర్పడ్డ వాయుగుండం కొన్ని జిల్లాలపైనే ప్రభావం చూపింది. గడచిన మూడు నాలుగు వారాల్లో సీమ నాలుగు జిల్లాల్లో మేఘాలు తప్ప చినుకు రాల్లేదు. సీమను ఆనుకొని ఉన్న ప్రకాశం, నెల్లూరులోనూ దాదాపు ఇలాంటి పరిస్తితులే ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో సరైన వర్షాల్లేక అనావృష్టి నెలకొనగా శ్రీకాకుళం, విశాఖపట్నంలో గత వారం రోజుల నుంచి వానలు వెనకపట్టు పట్టాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అనంతపురం, చిత్తూరులో తక్కువ వర్షం పడింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడకుంటే కడప, కర్నూలు తక్కువ వర్షపాత కేటగిరీలోకి చేరతాయి. ఇకపోతే చెరువుల కుంటలు నిండలేదు. కృష్ణాగోదావరి జలాల రాక కొంత సంతృప్తిగా ఉన్నా అనుకున్న విధంగా వరదలు రాలేదు. ఎగువన ఆల్మట్టి నుంచి నీరు వచ్చినా సాగర్‌ వరకు రాలేదు. దీంతో ఈ యేడు కూడా కృష్ణాబేసిన్‌ అంతంత మాత్రంగానే ఉంది. గోదావరిలో కూడా పెద్దగా నీరు రావడంలేదు. ఇటీవలి వాయుగుండం కారణంగా ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సాల్లో వర్షాలకు కొంత నీరు వచ్చి చేరింది. గోదావరి దిగువన ఉభయగోదావరి జిల్లాకు ప్రయోజనం చేకూరింది. ఇకపోతే వర్షాభావం కారణంగా విత్తనం మొలకెత్తినా తడులు లేకపోతే ఎలా అన్న ఆందోళన కలుగుతోంది. జిల్లా సగటు వర్షపాత లెక్కలను కాకుండా క్షేత్రస్థాయిలోకి తొంగి చూస్తే ఈ ఏడాది కూడా సీమ, సీమను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కరువు తప్పదనిపిస్తోంది. భూగర్భ జలాలు పెరగలేదు. వరుసగా నాలుగేళ్లుగా తీవ్ర కరువును చవిచూస్తున్న సీమ ఈ ఏటనైనా కాస్తంత తేరుకుంటుందని ఆశించిన రైతాంగాన్ని అప్పుడే వర్షాభావం పలకరించి వారి ఆశలను ఆవిరి చేసింది. తెలంగాణలో గతేడాది రైతులు ఎక్కువగా పత్తి మానేసి సోయాచిక్కుడు, పప్పుధాన్యాల వైపు మొగ్గుచూపారు. ఈ పంటలకు పెడుతున్న ఖర్చులు తిరిగి రావట్లేదని వ్యవసాయశాఖ గణాంకాలే చెపుతున్నాయి. పప్పుధాన్యాల సాగుపై దృష్టి మళ్లించాలని కేంద్రం తరచూ చెబుతోంది. మద్దతు ధరల విషయంలో మాత్రం వాటికి ప్రోత్సాహకాలేవిూ ఇవ్వట్లేదు. తెలంగాణలో కంది, మినుము, పెసర, సోయా పంటల సాగు వ్యయానికీ, ఇస్తున్న మద్దతు ధరకూ చాలా వ్యత్యాసముంది. స్వామినాథన్‌ కమిటీ చెప్పినట్లు ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలివ్వాలని తెలంగాణ వ్యవసాయశాఖ సిఫారసు చేసింది. సాగు ఖర్చులో సగం కూలి ఖర్చులే ఉంటున్నాయి. వరి, పత్తి పంటలకు ఈ వ్యయం అధికంగా ఉంటోంది. దీంతో ఈయేడు మళ్లీ వరి,పత్తిపంటలపై రైతులు ఆధారపడ్డారు. అయితే మబ్బులు మొహం చాటేయడంతో ఇరు రాష్ట్రాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. వేసిన విత్తనం బతుకుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. రాయలసీమలో అయితే తీవ్ర వర్షాభావం కారణంగా నీటి చుక్క లేక భూమి నెర్రెలిస్తోంది. అప్పుడే రక్షక తడులపై ఆధారపడాల్సిన దుస్తితి వచ్చింది. అనేక మండలాలు వర్షాభావంతో సతమతమవుతున్నాయి. ఖరీఫ్‌ మొదట్లోనే వర్షాభావం కారణంతో సీమలో వ్యవసాయం స్తంభించింది.

ముఖ్యంగా వేరుశనగకు పెనుముప్పుగా పరిణమించింది. నిరుడు విత్తనాలేశాక వర్షాభావం నెలకొనగా ఈ సంవత్సరం మొదటినుంచీ వర్షాభావమే. మొలకెత్తిన చోట వానలేక ఎండిపోతున్నాయి. విత్తనాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పురుగుపట్టిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు పడుతున్న వ్యధ అంతా ఇంతా కాదు. ఒక్క వేరుశనగే కాదు సీమలో దాదాపు అన్ని పంటల స్థితీ ఇలానే ఉంది. వర్షాభావం కారణంగా వరుసగా మూడేళ్ల నుంచీ సాగు విస్తీర్ణం తగ్గుతోంది. వరి, పత్తి తప్ప తతిమ్మా అన్ని పంటలూ తగ్గాయి. నిరుడు కరువు వలన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమాలో ఏదో ఒకటేనని, రైతుల ఆందోళనలతో రెండూ చెల్లిస్తామని ఇప్పటి వరకు చెల్లించలేదు. పంట నష్టపోయిన రైతులకు ప్రైవేటు బీమా కంపెనీ పలు జిల్లాల్లో క్లెయిములు ఎగ్గొట్టింది. ఎప్పటిలాగానే వర్షాల కోసం ఎదురు చూడటం పరిపాటిగా మారింది. రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలను, రాష్ట్రంలో మిగతా కరువు పీడిత ప్రాంత ప్రజలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆదుకోవాలి. తక్షణం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించి తగిన నిధులిచ్చి అమలు చేయాల్సి ఉంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కుంగిపోతుంటే, పౌష్టికాహారం అందుబాటులో లేక ప్రజల ఆరోగ్యాన్నే దెబ్బతీస్తోంది. ఈ దుస్థితి నుంచి బయటపడే చర్యలు చేప్టట్టాల్సి ఉంది. వర్షాభావంతో పంటలు కాపాడేలా ప్రణాళికలు సిద్దం చేయాలి.

 

Other News

Comments are closed.