వర్షాలతో చెరువులకు జలకళ

share on facebook

భూగర్భ జలాలు పెరిగాయన్న ఎమ్మెల్యే
కరీంనగర్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం పనులకు కొంత ఆటంకం ఏర్పడిందన్నారు.  తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల ఏర్పాటుతో కరువు ప్రాంతాల్లోని భూములు బంగారు మాగాణులుగా మారుతాయన్నారు. మరో ఐదారు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని, వచ్చే ఏడాది నుంచి నీరు అందిస్తామన్నారు. కరువు ప్రాంతాలను కూడా బంగారు మాగాణులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన తెలంగాణలో రైతాంగం బాగుండి, రాష్ట్రమంతా సస్యశ్యామలంతో ఉండాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రాజెక్టులు కడితే దశాబ్దాల పాటు సాగేవని… తెలంగాణ ప్రభుత్వం అలా కాదని, నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తిచేసి
సాగు, తాగు నీరు అందజేసేందుకు కృషిచేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు పోచంపాడ్‌ ప్రాజెక్టును కట్టేందుకు 37 సంవత్సరాల సమయం తీసుకున్నారని, ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి మూడున్నర సంవత్సరాలు కావస్తుందని, మరో ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి
చేస్తామని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుంచి సాగు నీరు అందజేస్తామని, వర్షాలు కురవకున్నా సాగుకు ఢోకా లేదన్నారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రాష్ట్రంలోని రైతాంగ సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని కాలం వెల్లదీశారని, స్వరాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత ఖర్చయినా పూర్తి చేసేందుకు వెనుకాడడం లేదన్నారు.

Other News

Comments are closed.