విజయోత్సవ ర్యాలీలు నిషేధం

share on facebook

విజయోత్సవ ర్యాలీ, ప్రదర్శనలకు అనుమతి లేదు
– రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌
ఓట్ల లెక్కిపు సందర్భంగా మంగళవారం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తెలిపారు. సోమవారం కీసర మండలం బోగారంలోని హోలీమేరి కళాశాలలో జిల్లాలోని అయిదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో వాహనాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి పాసులున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోగా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. లోపలికి వచ్చే వ్యక్తులు చరవాణులు, మంచినీళ్ల సీసాలు, అగ్గిపెట్టె, లైటర్‌ వంటి నిషేధిత వస్తువులు వెంట తీసుకురావద్దన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుల సూచనలు, సలహాలు పాటించి అందరు సహకరించాలని కోరారు. డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ శివకుమార్‌, సీఐ ప్రకాశ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

బందోబస్తుపై పర్యవేక్షణ
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం నగరంలో 14 చోట్ల, శంషాబాద్‌లో రెండు, కీసరలో ఒక చోట కేంద్రాల్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాల్ని ఆయా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూంల్లో భద్రపరిచారు. మంగళవారం లెక్కింపు నేపథ్యంలో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో కలిసి ముగ్గురు కమిషనర్లు పలు కేంద్రాల్ని సందర్శించి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.

లెక్కింపు కేంద్రాల వద్ద పార్కింగ్‌ సదుపాయం ఇలా..
ముషీరాబాద్‌, నాంపల్లి నియోజకవర్గాల లెక్కింపు ఎల్‌బీస్టేడియంలో, చాంద్రాయణగుట్టకు సంబంధించి   నిజాం కళాశాల లైబ్రరీహాలులో జరగనుంది. ఇక్కడికి వచ్చేవారు తమ వాహనాల్ని పబ్లిక్‌గార్డెన్‌, నిజాం కళాశాల, మహబూబియా కళాశాల, ఆలియా కళాశాలలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిలపొచ్చు.
అంబర్‌పేట… లెక్కింపునకు వచ్చే వారు నారాయణగూడ వైఎంసీఏ మైదానంలో, మలక్‌పేటకు సంబంధించిన వారికి అంబర్‌పేట సీపీఎల్‌ మైదానంలో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.
సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలకు ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్‌ స్టేడియం మైదానంలో ఏర్పాటు చేశారు.
గోషామహల్‌ నియోజకవర్గం కోసం వచ్చే వారు వాహనాలు నిలిపేందుకు కోఠి మహిళా కళాశాల క్యాంటీన్‌ వద్ద పార్కింగ్‌ ఉంది.
చార్మినార్‌, యాఖుత్‌పుర నియోజకవర్గాల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో, కార్వాన్‌, బహదూర్‌పుర నియోజకవర్గాలకు మాసబ్‌ట్యాంక్‌ హాకీ మైదానంలో పార్కింగ్‌ వసతి కల్పించారు.
ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాలకు యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో, కంటోన్మెంట్‌ నియోజకర్గానికి సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాల మైదానంలో పార్కింగ్‌ సదుపాయం ఉంది.

 

Other News

Comments are closed.