విత్తన సోయా రైతుల కష్టాలు తీరేదెప్పుడు?

share on facebook

ఆదిలాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): విత్తన కంపెనీల మాటలు నమ్మి అధికధర వస్తుందని సోయాబీన్‌ విత్తనోత్పత్తి చేసిన రైతులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. నాణ్యతగా లేవని విత్తన సంస్థలు కొనుగోలుకు నిరాకరిస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. విత్తన సోయాకు ధర ఎక్కువ ఇస్తామని చెప్పడంతో మూల విత్తనాలను వేసిన రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పంట బాగాలేదని, విత్తన శాతం లేదని అంటున్నారే కాని అసలు కొనుగోలు చేస్తారా లేదా అనేది చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో విత్తనోత్పత్తికి అనుకూల వాతావరణం, నేలలు ఉండటంతో సోయాబీన్‌ విత్తనోత్పత్తి చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థతో పాటు హాకా సంస్థ, వ్యవసాయశాఖలు వేర్వేరుగా ఉమ్మడి జిల్లా మొత్తంలో లక్ష క్వింటాళ్ల సోయా విత్తనాలు ఉత్పత్తి లక్ష్యంగా ఎంపిక చేసిన రైతులకు మూల విత్తనాలు సరఫరా చేశాయి.మార్కెట్‌లో ఉన్న ధర కంటే 30 శాతం ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తామని సంబంధిత సంస్థలు రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. తీరా ఇప్పుడు కొనుగోలుకు నిరాకరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట ఉత్పత్తులు అమ్ముడవుతాయా లేవా అన్న ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయశాఖ విత్తనోత్పత్తి ఉత్పత్తి చేయించేందుకు జిల్లాలోని తాంసి, తలమడుగు, జైనథ్‌, ఇచ్చోడ, నార్నూర్‌, ఉట్నూర్‌, బేల, జైనథ్‌ తదితర మండలాల్లో ఆసక్తి గల రైతులకు మూలు విత్తనాలు అందించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.విత్తన సోయా ధర గతేడాది క్వింటాలుకు రూ.4500 ఉండగా, ప్రభుత్వం విత్తనోత్పత్తి చేసిన రైతులకు అదనపు ప్రోత్సాహకంగా మరో రూ.500 ఇవ్వడంతో క్వింటాలుకు రూ.5 వేలుతో రైతులు అమ్ముకున్నారు. అధిక వర్షాలు, తెగుళ్ల నుంచి పంటను కాపాడు కునేందుకు రైతులు సాధారణ సోయా కంటే పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టారు. ఈ విషయం ఉన్నతాధి కారులకు నివేదించామని, త్వరలో కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు చెబుతున్నారు.

 

Other News

Comments are closed.