విద్యార్థులు ఒత్తిడిని జయించాలి

share on facebook

ఇప్పుడంతా పరీక్షల సీజన్‌. పరీక్షలంటే విద్యార్థులు ఎవరికైనా  సహజంగానే భయంఉంటుంది. ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, టెన్త్‌ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. జీవితానికి అతిముఖ్యమైన అంశంలో విజయం సాధించడానికీ, సమాయత్తం కావడానికీ ఈ పరీక్షలు ఎదుర్కోవడం ఒత్తిడి ఉండడం సహజం. ఒత్తిడిని పూర్తిగా తీసివేయడం కుదరదు. కానీ దాన్ని నియంత్రించుకోవచ్చు. ఒత్తిడిని జయించేం దుకు పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు సాగాలి. అప్పుడే విజయం సొంతం అవుతుంది. ఇందుకు టిప్స్‌ అలవాటు చేసుకోవాలి. మంచి సంగీతం వినడం,పాటలు వినడం, లఘు వ్యాయామం లాంటివి అలవర్చు కోవాలి. ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం, నిద్ర… ఈ నాలుగూ పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మంచి సాధనాలని గుర్తుంచుకోవాలి. ఒత్తిడిని జయించకపోతే వచ్చిన జవాబులు కూడా రాయలేకపోతాం అని గుర్తుంచుకోవాలి.  పోటీతత్త్వం పెరగడానికీ, విజయం సాధించాలనే తపన పెరగడానికీ ప్రయోజ నాత్మక ఒత్తిడి దోహదం చేస్తుంది. ఒత్తిడి గురించిన అవగాహన పెంచుకుంటే విజయం మనే సొంతం అవుతుంది. వార్షిక, ప్రవేశపరీక్షల దగ్గర్నుంచీ ఉద్యోగ నియామక పోటీపరీక్షల పరీక్షలవరకూ అన్నీ వరుసగా ఎన్నో పరీక్షలకు సన్నద్దం కావాల్సిన తరుణం ఇది.   అందుకే ఒత్తిగడి దుష్పరిణామాల బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం! పరీక్షలనగానే విద్యార్థులకు రకరకాల భయాలు తలెత్తుతూ ఉంటాయి. చదివిన ప్రశ్నలు పరీక్షలో రావేమో, వచ్చినవాటిని రాయటం మర్చిపోతానేమో, సిలబస్‌ అంతా కవర్‌ చేయడానికి సమయం సరిపోదేమో, పేపర్లు కఠినంగా దిద్దుతారేమో అని లేనిపోని ఆలోచనలు చేస్తుంటారు. వీటిలో కొన్ని అర్థం లేనివీ, కొన్ని మన పరిధిలో లేనివీ, అనవసరమైనవీ ఉంటాయి.  ఈ భయాలు మన బుర్రను సరిగా పనిచేయనియ్యవు. వాటిని తొలగించుకుంటేనే బుర్ర మామూలుకన్నా చురుకుగా పనిచేస్తుంది. వ్యర్థమైన ఆలోచనలకు దూరంగా ఉండి, సన్నద్ధత విూద పూర్తి దృష్టిపెట్టడం అవసరం. జీవితంలో అభివృద్ధీ, ప్రతిష్ఠా పరీక్షల ఫలితాలతో ముడిపడి ఉంటున్నాయి. నిజానికి వీటిలో విజయాలు సాధించలేనివారంతా జీవితంలో వెనుకబడుతున్నారని చెప్పడానికి వీల్లేదు. అయినా పరీక్షల్లో విజయం మన జీవిత గమనాన్ని సాఫీగా, తక్కువ ఒడిదుడుకులతో కొనసాగేలా చేస్తుంది. మంచి మార్కులూ, ర్యాంకులూ తెచ్చుకుంటే మరింత సులువుగా, త్వరగా జీవిత లక్ష్యాలను సాధించగలుగుతాం. అందుకే పరీక్షలంటే ఒత్తిడి రావడం, దానిని అధిగమించడం అన్నది అలవాటు చేసుకోవాలి. చదువుకు సంబంధించినంత వరకు  మానసిక సంసిద్ధత ఉంటేనే బుద్ధినీ, నైపుణ్యాలనూ సద్వినియోగం చేయడం సాధ్యమవుతుంది. పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై మనసులో స్పష్టమైన అవగాహన ఏర్పరచు కోవటం ద్వారా దీనిని తట్టుకోగలుగుతాం. పరీక్షల్లో నూటికి నూరు తెచ్చుకోవాలని ఆశించడం వేరు దానివల్ల కలిగే ఒత్తడిని తట్టుకోవడం వేరు.వాస్తవానికి దగ్గరగా లేని అంచనాలు అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. దీన్ని విద్యార్థులూ, తల్లిదండ్రులూ గమనించాలి. లక్ష్యం ఒక్కటైనా దాన్ని చేరుకునే మార్గాలు చాలా ఉంటాయి. విద్యార్థి తనకు అనుకూలమైన మార్గం ఎంచుకోవాలి. అలా చేరుకోవాలంటే… బలాలూ, బలహీనతలూ, అవకాశాలూ, సవాళ్ళను అంచనా వేసుకోవాలి. బలాలను సద్వినియోగం చేసుకునేలా, బలహీనతల నష్టం కనిష్ఠం చేసేలా, అవకాశాలను గరిష్ఠం చేసేలా, సవాళ్ళను ఎదుర్కొనేలా ప్రణాళిక ఉండాలి.  అయితే ఫలితాల విూద అంచనా మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉండాలి. విద్యార్థి తన బలాలూ, అవకాశాలను బట్టి ఎలంటి మార్కులూ, ర్యాంకులో రాగలవనేదానిపై ఒక వాస్తవిక అంచనాకు రావాలి. తనలో ఉన్న అననుకూల ధోరణిని అధిగమించేలా చూసుకోవాలి. అందరూ మొదటి ర్యాంకు
తెచ్చుకోవడం సాధ్యం కాదు. జీవితంలో దీర్ఘకాలిక విజయాల దృష్టితో చూసినపుడు ఒక పరీక్షలో మార్కులు కొద్దిగా ఎక్కువ తక్కువలైనా తట్టుకోగలగాలి.  రాత్రి ఎక్కువసేపు మెలకువ ఉండటం అలవాటైతే
ఇంకో అరగంట మెలకువగా ఉండి చదువుకోవాలి. అప్పుడే కష్టమైన సబ్జెక్టు చదివేందుకు ప్రణాళిక వేసుకోవాలి. వచ్చిన సమాధానం రాసి చూసుకుంటే బాగా గుర్తుంటుంది. కష్టమని భావించే ప్రశ్నలను రాసేందుకు సమయం కేటాయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పరీక్షలకు తయారవటంలో పఠనంతో పాటు పునశ్చరణ చాలా ముఖ్యం. రివిజన్‌ చేయడానికీ, చూడకుండా అప్పజెప్పడానికీ తేడా ఉంది. ఏకాగ్రత అంటే చేసే పనివిూద మనసు లగ్నం కావటం. చదివేటప్పుడు వేరే ఆలోచనలు మనసులోకి వస్తూవుంటే ప్రయోజనం పూర్తిగా పొందలేము. అంతరాయాలు లేకుండా చూసుకోవడం అసాధ్యం కాబట్టి అంతరాయాలనూ, వాటి ప్రభావాన్నీ అతి తక్కువగా ఉండేలా చూసుకోవడమే ఏకాగ్రతా రహస్యం. ధ్యానం మానసిక ప్రశాంతతకు ఉపకరిస్తుంది. అనవసర ఆందోళనను తగ్గించి ఏకాగ్రతకు తోడ్పడుతుంది. సిలబస్‌ చాలాసార్లు పునశ్చరణ చేసిందే అయినా  కొందరు ఆయా అంశాలను ఎందుకలా మర్చిపోతున్నదీ  బోధపడదు.  పరీక్షలు దగ్గరకొస్తున్నాయగానే ఆలోచనలన్నీ వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పరీక్షలో ఎలా రాయగలనో అన్న ఆందోళనలో ఒత్తిడి పెంచుతూ ఉంటుంది. సాధారణంగా, పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సంవత్సరమంతా చక్కగా చదివినా ఆందోళన చెందుతూ ఉంటారు. రాత్రీ పగలూ పరీక్షల గురించే ఆలోచించడం వల్ల విశ్రాంతి దొరకదు. ఒత్తిడి మూలంగా విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా కొన్ని సమస్యలేర్పడతాయి.  అందుకే  పరీక్షల సన్నద్ధతకు చక్కటి ప్రణాళిక రచించుకోవాలి. టీచర్లు క్లాస్‌
రూములక్లో వీటిని కూడా విద్యార్తులకు అర్థమయ్యేలా తెలియ చేయాలి. అప్పుడే ఒత్తడికి వారు దూరంగా ఉంటారు. టిప్స్‌ చెబితే చక్కగా బోధన అలవడుతుంది.

Other News

Comments are closed.